రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తాజాగా నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేశారు. పలువురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో.. వారి స్థానంలో రాష్ట్రపతి కోటాలో కొత్తగా నలుగుర్ని నామినేట్ చేయడం జరిగింది. ఈ జాబితాలో హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, ఉజ్వల్ దియోరావ్ నికమ్, డాక్టర్ మీనాక్షి జైన్, సి సదానందన్ మాస్టర్ ఉన్నారు. రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(a) ప్రకారం..సాహిత్యం, సైన్స్, కళ మరియు సామాజిక సేవలో ప్రత్యేక జ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం ఉన్న సభ్యులను నామినేట్ చేయడానికి ఆమెకు వీలుంటుంది.
నామినేట్ అయిన వారిలో ఉజ్వల్ నికమ్ భారతదేశంలోనే అత్యంత ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్లలో ఒకరు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల విచారణ మరియు ఇతర హై ప్రొఫైల్ క్రిమినల్ కేసుల్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించి ప్రసిద్ధి చెందారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో, ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఉజ్వల్ ను బీజేపీ పోటీలో నిలిపింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్ చేతిలో ఆయన ఓటమిని చవిచూశారు.
మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా.. అమెరికా, బంగ్లాదేశ్ మరియు థాయిలాండ్‌లకు రాయబారిగానే కాకుండా కీలక దౌత్య పదవులను నిర్వహించారు. 2023లో భారతదేశ జీ20 అధ్యక్ష పదవికి ఆయన చీఫ్ కోఆర్డినేటర్‌గానూ ఉన్నారు.
కేరళకు చెందిన సి సదానందన్ మాస్టర్.. అనుభవజ్ఞుడైన ఉపాధ్యాయుడు మరియు సామాజిక కార్యకర్త. చాలా కాలంగా బీజేపీతో అనుబంధం కలిగి ఉన్నారు.
డాక్టర్ మీనాక్షి జైన్ ప్రముఖ చరిత్రకారిణి మరియు విద్యావేత్త. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సభ్యురాలిగా పని చేసిన అనుభవం కూడా ఆమెకు ఉంది.