కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, ఫైర్ బ్రాండ్ నాయకుడు తీన్మార్ మల్లన్న కార్యాలయం వద్ద తీవ్ర రచ్చ చోటు చేసుకుంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అంశం హాట్‌హాట్‌గా మారిన నేపథ్యంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ అధికారంలో ఉండగా.. కవిత స్పందించలేదని.. ఇప్పుడు రోడ్డెక్కుతున్నారని.. రైలు రోకోలకు పిలుపు ఇస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మరికొన్న ఇవివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారని కవిత వర్గం చెబుతోంది.
ఈ క్రమంలోనే మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడులు చేశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతోపాటు.. కిటికీల అద్దాలను కూడా పగులగొట్టారు. అనంతరం.. కొందరు కార్యకర్తలు.. తగుల బెట్టేందుకు ప్రయత్నం చేయడంతో విషయం తెలుసుకున్న తీన్మార్ మల్లన్న గన్ మెన్.. గాలిలోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపి.. పరిస్థితిని దారిలోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు పోలీసులు కూడా రంగంలోకి దిగి.. పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు.
ఏంటి వివాదం..?
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌ను భుజాన వేసు కున్న కవిత.. ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నారు. కేవలం .. బిల్లు చేసి, కేంద్రానికి, రాష్ట్రపతికి పంపించి చేతులు దులుపుకోవడం కాదని.. దీనిపైచిత్తశుద్ధితో పనిచేయాలని ఆమె చెబుతున్నారు. అంతేకాదు.. తాము చేసిన డిమాండ్ల నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సర్కారు 42 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిందని చెబుతున్నారు.
దీనిపై కాంగ్రెస్ నాయకులు.. పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా కాంగ్రెస్‌తో దూరంగా ఉంటున్న తీన్మార్ మల్లన్న కూడా.. స్పందించారు. కవితకు పనీ పాటా లేదని.. కూలిపోయిన బీఆర్ ఎస్‌ను పైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న ధోరణిలో విమర్శలు గుప్పించారు. ఇదే.. రచ్చకు దారితీసింది.
కంచం పొత్తా.. మంచం పొత్తా?
``బీసీలకు సంబంధించిన రిజర్వేషన్‌పై ఆర్డినెన్సు తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే.. కవిత.. ఇల్లు పొల్లు.. కులాలను పూసేసుకుంటోంది. నీకేంటి సంబంధం..? నువ్వేమన్నా బీసీవా..? బీసీలతో నీకేమన్నా.. కంచం పొత్తుందా? మంచం పొత్తుందా?. నువ్వు ఓన్ చేసుకోవడమేంటి? మాకర్థం కాదు?`` అని తీర్మాన్ మల్లన్న వ్యాఖ్యానించారు.