టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గత ఎన్నికల్లో పోటీ చేయని సంగతి తెలిసిందే. అశోక్ గజపతి రాజు కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అశోక్ గజపతి రాజుకు కేంద్ర ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. తాజాగా ఆయనను గోవా గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.
1951 జూన్ 26న జన్మించిన అశోక్ గజపతి రాజు..1978లో తొలిసారిగా జనతా పార్టీ తరఫున విజయనగరం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1983,1985,1989,1994,1999,2009లో అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పలుమార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న అశోక్ గజపతి రాజు 2014లో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ క్రమంలోనే ఎన్డీఏ హయాంలో కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు.
అశోక్ గజపతి రాజు గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. ఉత్తరాంధ్ర ప్రజలు రాజుగారు అని పిలుచుకునే అశోక్ గజపతి రాజు నిజంగా మనసున్న మారాజే. ప్రజల కోసం సొంత ఆస్తులు ఖర్చు పెట్టిన వంశం వారిది. ఆ తర్వాత రాజకీయాల్లోనూ ప్రజా సేవే పరమావధిగా అశోక్ గజపతి రాజు సేవ చేశారు. రాజవంశానికి చెందినప్పటికీ అశోక్ గజపతి రాజు సాదాసీదాగా ఉండేవారు.