వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి నోరు పారేసుకున్నారు. ఇటీవల కృష్ణ జిల్లా పామర్రులో జరిగిన పార్టీ సమావేశంలో `రప్పా రప్పా` అంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో చెప్పక్కర్లేదు. పలుచోట్ల ఆయనపై కేసులు కూడా నమోదు అయ్యాయి. అయినప్పటికీ పేర్ని నాని తీరు మారలేదు. పెడనలో ఆదివారం నిర్వహించిన వైకాపా సమావేశంలో నాని మళ్లీ రెచ్చిపోయారు. తాను చేసిన రప్పా రప్పా వ్యాఖ్యలను సమర్థించుకోవడమే కాకుండా కూటమి నేతలను అరేయ్ ఒరేయ్ అంటూ అవమానకర పదజాలంతో విమర్శలు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మరియు నారా లోకేష్ లను ఉద్ధేశించి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 76 ఏళ్ల ముసలోడివి నువ్వు ఇంకెంతకాలం బ్రతుకుతావో తెలియదు.. నువ్వు 50 ఏళ్ల జగన్‌ను భూస్థాపితం చేస్తావా? అది నీ స్థాయి కాదు, నీ కొడుకు స్థాయి కూడా కాదు అంటూ నాని విమర్శించారు. ఈ క్రమంలోనే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవారం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తావన తెస్తూ పేర్ని నాని సవాల్ విసిరారు.
వల్లభనేని వంశీని ఏదో చేస్తానని ఎన్నికల ముందు నారా లోకేశ్ బెదిరించాడు. తర్వాత వంశీని ఐదు నెలలు జైలులో పెట్టారు. అంతకు మించి ఏం చేశారు? అని పేర్ని నాని ప్రశ్నించారు. ఆరోగ్య సమస్యలను దూరం చేసుకొని, మరో మూడు నెలల్లో కొడాలని నాని గుడివాడకు వస్తాడు.. దమ్ముంటే ఆయన్ను చెడ్డీతో నడిపించండ్రా చూద్దాం అంటూ పేర్ని నాని కూతమి నేతలకు ఛాలెంజ్ విసిరారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్రలపై కూడా పేర్ని నాని పరుష పదజాలాన్ని ఉపయోగించి విమర్శలు చేశారు. ప్రస్తుతం నాని వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించాయి.