తెలంగాణలో మరో పొలిటికల్ హీట్ స్టార్టయింది. తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నను పదవి నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఆమె ఫిర్యాదు చేశారు. మహిళల ఆత్మగౌరవంపై తీన్మార్ మల్లన్న దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. మహిళల పట్ల ఇంత నీచంగా మాట్లాడతారా? అని నిప్పులు చెరిగారు. తెలంగాణ సమాజం వీటిని హర్షించబోదన్నారు.
ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని.. ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని కవిత డిమాండ్ చేశారు. మహిళలకు తెలంగాణ సమాజం ప్రాధాన్యం ఇస్తుందన్న ఆమె.. బోనం ఎత్తుకున్న మహిళలను అమ్మవారితో సమానంగా చూస్తారని చెప్పారు. మరోవైపు.. రాష్ట్ర డీజీపీని కూడా కలిసిన కవిత.. మల్లన్నపై కేసు పెట్టాలని కోరుతూ.. డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన జాగృతి కార్యకర్తలపై దాడులు చేశారంటూ.. కొన్ని ఆధారాలను కూడా సమర్పించారు.
ఇక, మల్లన్న స్పందిస్తూ.. కవిత పంచాయతీ.. పెట్టుకునేందుకు తనతో పోటీ పడుతున్నారని వ్యాఖ్యానిం చారు. కేసీఆర్, కేటీఆర్‌తో ఉన్న పంచాయతీ కుదరక తనపై పడ్డారని అన్నారు. వారితో ఉన్న పంచాయ తీని వారితోనే తేల్చోకోవాలన్నారు. అనవసరంగా తనను టార్గెట్ చేయొద్దన్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మాట్లాడే హక్కు ఉందన్నారు. రిజర్వేషన్ల కోసం.. బీఆర్ ఎస్ పార్టీ ఏనాడైనా కొట్లాడిందా? అని ప్రశ్నించారు.
కవిత ఎప్పుడైనా కేసీఆర్‌ను రిజర్వేషన్ల కోసం ప్రశ్నించారా? అని తీన్మార్ మల్లన్న నిలదీశారు. కాంగ్రెస్ అజెండాను.. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను తమవిగా ప్రచారం చేసుకుంటే ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారన్ని ప్రశ్నించారు. తనను చంపేందుకు కవిత నేతృత్వంలోని జాగృతి కార్యకర్తలు ప్రయత్నించారని చెప్పారు. అందుకే తన గన్‌మెన్ గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు.