ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతుంది. భర్తతో విడాకులకు సిద్ధమైంది. ఆదివారం తన భర్త పారుపల్లి కశ్యప్ నుండి విడిపోతున్నట్లు సైనా నెహ్వాల్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. `జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశల్లోకి తీసుకెళుతుంది. ఎన్నో ఆలోచనలు, మరెన్నో చర్చల అనంతరం కశ్యప్ పారుపల్లి మరియు నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మానసిక ప్రశాంతత, ఎదుగుదల, స్వస్థతను కోరుకుంటూ మాకోసం తీసుకున్న నిర్ణయమిది. ఇప్పటివరకూ ఉన్న చిరస్మరణీయ జ్ఞాపకాలకు కృతజ్ఞతలు. ఈ సమయంలో మా గోప్యతను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను` అంటూ సైనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.
ఈ విడాకుల ప్రకటన అటు సోషల్ మీడియాతో పాటు ఇటు ప్రధాన మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. సైనా నెహ్వాల్, కశ్యప్ పారుపల్లి.. ఇద్దరూ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులే. సైనా మరియు కశ్యప్ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందారు. సైనా తన అద్భుతమైన ప్రదర్శనలు మరియు ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి భారీ స్టార్డమ్ సంపాదించుకోగా.. 2014 కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతకం గెలిచి కశ్యప్కూడా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు.
ఇక బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో సైనా, కశ్యప్‌ల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. 2018లో ఈ జంట కుటుంబ సభ్యుల అంగీకారంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా పాతికేళ్ల ప్రేమకు, ఏడేళ్ల వివాహ బంధానికి విడ్కోలు పలికేందుకు సైనా, కశ్యప్ దంపతులు రెడీ కావడంతో వారి అభిమానులు విడాకుల ప్రకటనను జీర్ణయించుకోలేకపోతున్నారు. కాగా, కశ్యప్ కాంపిటీటివ్ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, కోచింగ్ రంగంలో స్థిరపడ్డారు. మరోవైపు వరుస గాయాలతో ఇప్పటికే ఆటతీరును కోల్పోయిన సైనా.. గత ఏడాది నుంచి ఆర్థరైటిస్‌తో బాధపడుతోంది. త్వరలోనే కెరీర్ విషయంలో ఆమె కీలక నిర్ణయం తీసుకోనుంది.