‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. తన సినిమాల పట్ల ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఆసక్తిని ప్రదర్శించారు. పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్ తెచ్చుకోగల సత్తా ఉన్న హీరోగా విజయ్ దేవరకొండ మీద అంచనాలు ఏర్పడ్డాయి. ‘లైగర్’ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండుంటే నిజంగానే పాన్ ఇండియా స్టార్ అయ్యేవాడేమో విజయ్. కానీ ఆ సినిమా దారుణమైన ఫలితాన్నందుకుంది. దీంతో విజయ్ తర్వాతి చిత్రాలను హిందీలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ధైర్యం చేయలేకపోయారు. కానీ విజయ్ కొత్త సినిమా ‘కింగ్‌డమ్’ ప్రోమోలు చూస్తే ఇది అన్ని భాషల్లో బాగా ఆడగలదు అనిపించింది. ఇటీవల రిలీజ్ డేట్ ప్రోమో రిలీజ్ చేసినపుడు ‘కింగ్‌డమ్’ను హిందీలోనూ విడుదల చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపించాయి. ఇది చూసేనేమో.. నిర్మాత నాగవంశీ ‘కింగ్‌డమ్’ హిందీ రిలీజ్‌కు సన్నాహాలు చేసినట్లున్నాడు.
‘కింగ్‌డమ్’ ఈ నెల 31న తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల కాబోతోంది. కానీ రిలీజ్ పరిమితంగానే ఉండబోతోంది. ‘కింగ్‌డమ్’ థియేటర్లలో రిలీజైన నెల రోజులకే ఓటీటీలో రిలీజయ్యేలా ఒప్పందం జరిగింది. ఇలా ఉంటే ఉత్తరాదిన కొన్ని ప్రధాన మల్టీప్లెక్సులు సినిమాను రిలీజ్ చేయవు. ఐతే హిందీ వెర్షన్ మీద మరీ ఎక్కువ ఆశలు లేని నేపథ్యంలో మల్టీప్లెక్సుల సంగతి పక్కన పెట్టేసి వీలున్న థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ‘కింగ్‌డమ్’కు తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి బజ్‌యే ఉంది. ఇది శ్రీలంక తమిళులతో ముడిపడ్డ కథ కావడమే అందుకు కారణం. ఈ సినిమాతో విజయ్ ఫ్లాపుల పరంపరకు తెర పడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి రూపొందించిన ఈ చిత్రంలో విజయ్ సరసన ‘మిస్టర్ బచ్చన్’ భామ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.