వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. 76 ఏళ్ల ముసలోడివి.. ఇంకెంతకాలం బ్రతుకుతావో తెలియదు.. నువ్వు 50 ఏళ్ల జగన్‌ను భూస్థాపితం చేస్తావా? అంటూ పరుష పదజాలాన్ని ఉపయోగించి పేర్ని నాని విమర్శలు చేశారు. పైగా కూటమి నేతలను అరేయ్ ఒరేయ్ అంటూ రెచ్చిపోయారు. అయితే తాజాగా హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ పేర్ని నాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
76 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ తీవడానికి నిత్యం 18 గంటలు శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు రాష్ట్రానికి సేవ చేశారు. అటువంటి చంద్రబాబును ఇలా విమర్శించడం సమంజసమా? అని అనిత ప్రశ్నించారు. పొద్దున్నే షుగర్, బీపీ టాబ్లెట్స్ వేసుకుంటే కానీ రోజు గడవని వారు, పది సంతకాలు చేసేసరికి చేతులు వణికే వాళ్లు కూడా బాబు వయస్సు గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందంటూ పేర్ని నాని గాలి తీసేశారు అనిత.
అసెంబ్లీలో అధ్యక్షా అన్న వ్యక్తి, ఇతర నాయకులకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా అవమానకర పదజాలంతో విమర్శించడం కరెక్ట్ కాదన్నారు. మీరనే మాటలకు తాము ప్రతీకారాలు తీర్చుకుంటూ పోతే.. మీకు, తమకు తేడా ఉండదని.. అందుకే తమ పని తాము చేసుకుంటున్నామని.. అలాగని నోటికొచ్చినట్లు తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదంటూ పేర్ని నానికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.