డైరెక్ట్ టు మొబైల్ (D2M) టెక్నాలజీ పితామహుడు, కొరియాకు చెందిన ఖుష్ టెక్ కంపెనీ సీఈవో ఎరిక్ షిన్ కొద్ది రోజుల క్రితం ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ తో ఆయన భేటీ అయి చర్చలు జరిపారు. ఏపీలో డీ2ఎమ్ టెక్నాలజీ ఫోన్లు, ట్యాబ్ల తయారీ యూనిట్ పెట్టాలని లోకేశ్ ఆహ్వానించారు. కంపెనీ స్థాపించేందుకు అవసరమైన అనుమతులు, స్థలం, మౌలిక సదుపాయాలు యుద్ధప్రాతిపదికన కల్పిస్తామని లోకేశ్ హామీనిచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ఎరిక్ షిన్ ముందుకు వచ్చారు.
డీ2ఎమ్ టెక్నాలజీ సాయంతో పనిచేసే ఫీచర్ ఫోన్లు, ట్యాబ్ల తయారీ యూనిట్ ను ఏపీలో నెలకొల్పబోతున్నామని ఎరిక్ షిన్ ప్రకటించారు. ముందుగా 20 మిలియన్ డాలర్ల పెట్టుబడితో కంపెనీని ప్రారంభిస్తామని, ఐదేళ్లలో మొత్తం 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నామని ఎరిక్ షిన్ వెల్లడించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి లోకేశ్ ఇచ్చిన ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నామని, లోకేశ్ వంటి యువనేతతో కలిసి పనిచేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అన్నారు.
జూలై చివరి నాటికి ఏపీలో డీ2ఎమ్ ఫోన్ కు బీఐఎస్ సర్టిఫికేషన్ లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం కూడా ఎదురుచూస్తున్నామన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యాలకు, మేకిన్ ఇండియా కాన్సెప్ట్ కు అనుగుణంగా ఏపీలో తమ సంస్థ పెట్టబోతున్నామని తెలిపారు. తనకు భారత్ అంటే ఇష్టమని, భారతీయులను సంతోషంగా ఉంచాలనే తన కంపెనీకు ఖుష్ టెక్ అని పేరు పెట్టానని చెప్పారు.
ఇంటర్నెట్, వైఫై, మొబైల్ డేటా, సిమ్ కార్డ్ సాయం లేకుండానే ప్రజలకు లైవ్ టీవీ ఛానెళ్లు, ఓటీటీలు, ఆడియో బ్రాడ్ కాస్ట్ లు, ఇంటర్నెట్, వాయిస్ కాల్స్, మెసేజులు అందించే సరికొత్త టెక్నాలజీనే డీ2ఎమ్. గిరిజన, అటవీ, కొండ ప్రాంతాలతో మారుమూల పల్లెల్లో నివసించే ప్రజలకు ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు, ఆర్థిక ఇబ్బందుల వల్ల మొబైల్ డేటా, ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్, వైఫై ఇతరత్రా కనెక్షన్ ఖర్చు భరించలేని ప్రజలకు ఈ టెక్నాలజీ ద్వారా ఇంటర్నెట్ సేవలు, ఫోన్ కాల్స్ సేవలు అతి తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి. భారత్ లోని సాంఖ్యా ల్యాబ్, తేజస్ నెట్ వర్క్ సంస్థతో కలిసి ఖుష్ టెక్ సంస్థ డీ2ఎమ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఆ టెక్నాలజీ ఆధారిత ఫీచర్ ఫోన్, ట్యాబ్ డెవలప్ చేసింది.
సిగ్నల్ తక్కువగా ఉండే ప్రాంతాలలో సైతం ఈ టెక్నాలజీ ద్వారా మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో, పౌర సేవలను ఇంటివద్దకే మరింత సులభంగా తేవడంలో డీ2ఎమ్ టెక్నాలజీ ఉపకరిస్తుంది. ఇంటర్నెట్, మొబైల్ సిగ్నల్ లేని సమయంలో కూడా డీ2ఎమ్ ద్వారా వాతావరణం, వరదలు, భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు వంటి వాటికి సంబంధించిన హెచ్చరికలు, విపత్తు హెచ్చరికలు వంటి వాటిని డీ2ఎమ్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు చేరవేయవచ్చు. మారుమూల, గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, రైతులకు వాతావరణానికి సంబంధించిన విషయాలను నేరుగా వారికి చేరవేయడంలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది.