ఒకప్పటి టాలీవుడ్ స్టార్ బ్యూటీ జెనీలియా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లాడింది. వివాహం అనంతరం నటిగా జెనీలియా జోరు తగ్గించింది. భర్త, ఇద్దరు పిల్లలకే తన సమయాన్ని కేటాయించింది. అయితే దాదాపు 13 ఏళ్ల గ్యాప్ అనంతరం జెనీలియా తాజాగా `జూనియర్` మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. కర్ణాటక రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి డెబ్యూ ఫిల్మ్ ఇది. శ్రీలీల హీరోయిన్ కాగా.. జెనీలియా కథలో అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించింది.
మంచి అంచనాల నడుమ నేడు తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా జెనీలియా రీఎంట్రీకి పర్ఫెక్ట్ సినిమానే పడిందంటున్నారు. సెటిల్డ్ పర్ఫార్మెన్స్ మరియు ఫుల్ ఎమోషన్ తో ఆమె అద్భుతంగా మెప్పించిందని చెబుతున్నారు. అయితే జూనియర్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా.. టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చేందుకు ఇంత లాంగ్ గ్యాప్ తీసుకోవడానికి రీజనేంటో వివరించింది.
నటీనటుల జీవితంలో సినిమాలు ముఖ్యమైనవే, కానీ ఫ్యామిలీ అంతకన్నా ముఖ్యమని జెనీలియా తెలిపింది. భర్త, పిల్లలతో విలువైన సమయం గడిపేందుకు, వారి బాగోగులు చూసుకునేందుకే ఇన్నేళ్లు బ్రేక్ తీసుకున్నానని.. ఈ 13 ఏళ్లలో నా భర్త, పిల్లలతో పూర్ణమైన జీవితం గడిపానని జెనీలియా వివరించింది. ఇప్పుడు వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటున్నారు.. కాబట్టే మళ్లీ కెమెరా ముందుకి రావాలని అనిపించింది.. నా భర్త కూడా గత మూడేళ్ల నుంచి రీఎంట్రీ ఇవ్వాలంటూ తెగ టార్చర్ చేస్తున్నాడని జెనీలియా సరదాగా కామెంట్స్ చేసింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.