ఈ తరంలో బెస్ట్ హాలీవుడ్ డైరెక్టర్ ఎవరు అంటే.. మెజారిటీ చెప్పే పేరు ‘క్రిస్టఫర్ నోలన్’దే. ఒక రకంగా ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ దర్శకుడు అతనే అని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు భారీగా అభిమాన గణం ఉంది. ఇండియాలో కూడా కాస్టింగ్‌తో సంబంధం లేకుండా నోలన్ పేరు చూసి కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయే ప్రేక్షకులు లక్షల మంది ఉన్నారు. నోలన్ ప్రతి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక వర్గం ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.
ఆయన చివరి చిత్రం ‘ఆపెన్ హైమర్’ తన గత చిత్రాల్లా థ్రిల్లింగ్‌గా, మెదడుకు పరీక్ష పెట్టేలా లేకపోయినా.. డీప్ ఎమోషన్లతో ప్రేక్షకులను కట్టి పడేసింది. కమర్షియల్‌గానూ ఆ సినిమా మంచి ఫలితాన్నందుకుంది. దీని తర్వాత నోలన్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం.. ‘ది ఒడిస్సీ’. ఈ సినిమా కథేంటో అందరికీ తెలియదు. ఆర్టిస్టుల గురించి ఐడియా లేదు. ఇంకా ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ కాలేదు. కానీ అప్పుడే ఈ సినిమా టికెట్ల కోసం ప్రేక్షకులు ఎగబడిపోతున్నారు.
‘ది ఒడిస్సీ’ రిలీజ్ కాబోయేది 2026 జులై 26న. ఐతే యుఎస్‌లోని ఐమాక్స్ స్క్రీన్లలో ఈ సినిమాకు అప్పుడే బుకింగ్స్ మొదలుపెట్టేశారు. సరిగ్గా రిలీజ్‌కు ఏడాది ఉండగా టికెట్లు ఓపెన్ చేయగా.. నిమిషాల్లో అవన్నీ సేల్ అయిపోయాయి. పెట్టిన టికెట్లు పెట్టినట్లు అమ్ముడైపోయాయి. ఐమాక్స్ స్క్రీన్లలో చూడడానికి నోలన్ సినిమాల కంటే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే చిత్రాలు వేరే ఉండవు. ఆయన సినిమా వస్తుంటే ఈ స్క్రీన్లలో కొన్ని వారాల పాటు ముందే టికెట్లు సోల్డ్ ఔట్ అయిపోతాయి.
ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకునే ఏడాది ముందే టికెట్ల సేల్ మొదలుపెట్టగా జనం ఎగబడి కొనేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పద్ధతిని అనుసరించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇండియాలో కూడా ఐమాక్స్ స్క్రీన్లలో ఈ చిత్రానికి అర్లీ మార్నింగ్ షోలు వేయాలనుకుంటున్నారు. చాలా ముందుగానే టికెట్ల అమ్మకం పూర్తయ్యే అవకాశముంది.