స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కోల్డ్ వార్ చాలా కాలంగా నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు నేతలు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కేసీఆర్, కేటీఆర్ లు ఎన్నోసార్లు పంచాయతీ చేశారు. ఆ తర్వాత కడియం శ్రీహరి గులాబీ గూడు వీడి హస్తగతమవడంతో ఆ పంచాయతీకి తెరపడింది. అప్పటి నుంచి కడియం శ్రీహరిపై రాజయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా కడియం శ్రీహరిపై రాజయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరికి సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 200 కోట్లకు అమ్ముడుపోయిన శ్రీహరి కాంగ్రెస్‌లో చేరారని ఆరోపణలు గుప్పించారు. అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు కడియం శ్రీహరి వివరణ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫారాయించిన కడియం శ్రీహరిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే తాను కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కడియం శ్రీహరి ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నానని తప్పించుకునే ప్రయత్నం చేయడం కుదరదని అన్నారు. ఆ పక్షంలో కడియం తన ముక్కు నేలకు రాసి కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.