బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే వారికి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులిచ్చారు. దీంతో, వారితోపాటు సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు విమర్శలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీవు మగాడివైతే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. ఎన్నికల్లో చూసుకుందాం అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి.
గద్వాలలో జరిగిన సభలో మాట్లాడిన కేటీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. గతంలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఆ మాటను ఎందుకు గుర్తుచేసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. పదేళ్ల కేసీఆర్ పాలనకు, రెండేళ్ల రేవంత్ పాలనకు తేడా ఏంటో తెలియాలంటే ఆ పది మందితో రేవంత్ రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. తాను సాధారణంగా ఈ తరహా భాష వాడనని, కానీ, రేవంత్ రెడ్డికి ఆయన భాషలోనే చెబితే అర్థమవుతుందని ఇలా మాట్లాడానని వివరణనిచ్చారు.
ఇక, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై కూడా కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవసరమైతే రైలు కింద తలపెడతా కానీ కాంగ్రెస్‌లో చేరను అని చెప్పిన వ్యక్తి ఆయనే అని చురకలంటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన పార్టీ మారలేదని విమర్శించారు. 563 గ్రూప్-1 ఉద్యోగాలను ఒక్కొక్కటి రూ. 3 కోట్ల చొప్పున కాంగ్రెస్ సర్కార్ అమ్ముకుందని, రూ.1,700 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.