మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ ఛెస్ లో ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్ గా ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. చెస్ గేమ్‌లో అత్యంత వేగంగా 175 చెక్‌మేట్ పజిల్స్‌ను రికార్డు స్థాయిలో 11 నిమిషాల 59 సెకన్లలోనే దేవాన్ష్ పూర్తిచేశాడు. గత ఏడాది డిసెంబరులో ఈ ఘనత సాధించిన దేవాన్ష్ నేడు లండన్‌లోని చారిత్రక వెస్ట్‌మిన్‌స్టర్ హాల్‌లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025 పురస్కారాన్ని అందుకున్నాడు. లోకేశ్ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శభాష్ ఛాంప్ అంటూ దేవాన్ష్ కు తాత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. మా దేవాన్ష్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు 2025 అందుకోవడం గర్వంగా ఉందని తెలిపారు.
నెలల తరబడి చూపిన దేవాన్ష్ చూపిన పట్టుదల, గురువుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన చెప్పారు. దేవాన్ష్ సాధించిన ఈ రికార్డు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అంతర్జాతీయ వేదికపై దేవాన్ష్ ప్రతిభకు గుర్తింపు లభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని అన్నారు. మరోవైపు, దేవాన్ష్ కు నాయనమ్మ నారా భువనేశ్వరి కూడా శుభాకాంక్షలు తెలిపారు. చిన్న వయసులోనే చెస్ లో క్రమశిక్షణ, అంకితభావంతో దేవాన్ష్ చూపిస్తున్న ప్రతిభకు ఈ పురస్కారం ఒక నిదర్శనంగా నిలిచిందని ప్రశంసించారు.
నా ప్రియమైన మనవడు దేవాన్ష్, లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ హాల్‌లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గౌరవాన్ని అందుకున్నందుకు నా ప్రేమ, ఆశీస్సులు. పదేళ్లకే చెస్‌లో నీ ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావం మా కుటుంబానికి ఎంతో గర్వకారణం. నువ్వు ఇలాగే ఉజ్వలంగా రాణిస్తూ మరెన్నో మైలురాళ్లు అందుకోవాలి అని భువనేశ్వరి ఆకాంక్షించారు.