విశాఖపట్నంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేపట్టిన 'సారథ్యం' యాత్ర ముగింపు సభ నేడు జరిగింది. ఈ సభకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నడ్డా సంచలన ఆరోపణలు చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందని ఆరోపించారు. ప్రజలను గత పాలకులు దారుణంగా మోసం చేశారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ మళ్లీ పునరుజ్జీవనం పొందుతోందని అన్నారు.
మోదీ, చంద్రబాబుల సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధిలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందన్నారు. 2014కు ముందు దేశంలో వారసత్వ, అవినీతి రాజకీయాలు రాజ్యమేలాయని, ప్రధాని మోదీ నాయకత్వంలో 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' అనే నినాదంతో దేశం ముందుకు సాగుతోందని నడ్డా గుర్తుచేశారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదేనని కొనియాడారు.
సాగర్ మాల పథకం కింద ఏపీలో 14 పోర్టుల నిర్మాణం, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడం, జాతీయ రహదారుల విస్తరణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు, మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనలతో కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు.