రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై తాజాగా నిర్వహించిన సర్వేల్లో ప్రజల అభిప్రాయం స్పష్టంగా కనిపించింది. 15 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి పథకాలను అమలు చేస్తున్న విషయం వాస్తవమే. వీటిలో అధికారంలోకి వచ్చీ రాగానే ప్రారంభించిన కార్యక్రమం ఉచిత ఇసుక. ఇసుకను పూర్తిస్థాయిలో ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి చంద్రబాబు అప్పట్లో శ్రీకారం చుట్టారు. కేవలం కొద్దిపాటి స్వల్ప ఖర్చులను పెట్టుకుని ప్రజలు ఎవరైనా సరే సొంతంగా బళ్ళు పెట్టుకుని మరీ వెళ్లి ఇసుకను తెచ్చుకునే సౌలభ్యాన్ని కల్పించామని చెప్పారు.
అదే సమయంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 205 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. 183 మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇలా .. ప్రభుత్వం రాగానే ప్రారంభించిన ఈ రెండు అంశాలపై కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పేదల సంక్షేమానికి అలాగే మధ్యతరగతి వర్గాల సంతృప్తికి ప్రాధాన్యమిస్తూ ఈ రెండు అంశాలను తీసుకున్నామని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇవే అంశాలపై జరిగిన సర్వేలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా అంటే ఉచిత ఇసుకపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
వైసీపీ హయాంలో కన్నా కూడా ఇప్పుడు ఎక్కువ ధరలు వెచ్చించాల్సి వస్తుందని ఎక్కువ మంది ప్రజలు చెబుతు న్నారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్న విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, అనకాపల్లి, అనంతపురం తదితర ప్రాంతాల ప్రజలు మండిపడుతున్నారు. పైగా ఇంత ధర పెట్టినా కూడా తమకు లభించటం లేదన్న వాదన వినిపిస్తుండడం మరో విశేషం. గతంలో వైసిపి హయాంలో ఇసుకను భారీ ధరలకు అమ్ముకున్నారని, నాయకులు సొమ్ము చేసుకున్నారని ఆరోపిస్తూ ఉచిత ఇసుకను ప్రవేశపెట్టిన చంద్రబాబు.. దీనిని పర్యవేక్షించడంలో వెనుకబడ్డారు అన్నది తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.
ఇక అన్న క్యాంటీన్ల విషయానికి వస్తే దీని పట్ల మెజారిటీ ప్రజలు సంతృప్తి గానే ఉన్నారు. అయితే క్వాంటిటీ విషయంలో మాత్రం అసంతృప్తి వ్యక్తం అవుతోంది. సహజంగా ప్రస్తుతం ఐదు రూపాయలకి ఏ వస్తువు కొనే పరిస్థితి లేదు. ఏది రాదు కూడా. కాబట్టి ఐదు రూపాయలకు పెడుతున్నామన్న పేరు ఉన్నప్పటికీ క్వాంటిటీ తగ్గడంతో అన్న క్యాంటీన్లకు వస్తున్న వారు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మార్పు చేసుకోవాలి. అవసరమైతే దీనిని రెట్టింపు ధర అంటే పది రూపాయలు చేయాలని కొంతమంది సూచిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తే అన్నా క్యాంటీన్ల మీద ఉన్న అభిప్రాయం మరింత బలపడేటటువంటి అవకాశం ఉంది.