ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష హోదా తమకు ఇవ్వలేదన్న కారణాన్ని సాకుగా చూపి వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యేలపై, ఆ పార్టీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు జగన్ పై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు.
జగన్ ఎప్పటికైనా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. అసెంబ్లీకి రాకుండా పిరికిపందల్లా వైసీపీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారని దుయ్యబట్టారు. తమ సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకంతో వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారని, కానీ, వారు సభకు రాకుండా ప్రతిపక్ష హోదా కావాలని కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
గత ఐదేళ్లలో తాము చేసిన స్కాములు బయటపడతాయన్న భయంతోనే శాసనసభకు వైసీపీ సభ్యులు హాజరు కావడం లేదని గోరంట్ల సంచలన ఆరోపణలు చేశారు. ఐదేళ్ల జగన్ పాలనను ప్రజలు చూశారని, అందుకే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకే పరిమితం చేసిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తించుకోవాలని సెటైర్లు వేశారు. అసెంబ్లీలో 10% సభ్యులు లేనప్పుడు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని? అది ప్రజలు ఇచ్చిన తీర్పు అని గోరంట్ల అన్నారు.
సిగ్గు, శరం ఉంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలకు గోరంట్ల విమర్శించారు. మండలి సమావేశాలకు హాజరవుతున్న వైసీపీ సభ్యులు...శాసనసభకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. తనపై ఉన్న ఈడీ కేసులను 12 ఏళ్లుగా జగన్ ఎందుకు వాయిదా వేయించుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు.