దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ ఆరోపణలకు మద్దతుగా పలు రాష్ట్రాలలోని కాంగ్రెస్ నేతలు కూడా ఈ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రధాని మోదీపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షాకింగ్ ఆరోపణలు చేశారు. పథకం ప్రకారం దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని, దీని వెనక మోడీ ఉన్నారని షర్మిల ఆరోపించడం షాకింగ్ గా మారింది.
ఓట్ల తొలగింపుపై రాహుల్ గాంధీ ఆధారాలతో మాట్లాడుతున్నారని, మోడీ బండారం బట్టబయలు కాబోతుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం...బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆమె ఆరోపించారు. కోట్లాదిమంది ఓట్ల ఓటు హక్కును కాలరాస్తున్న ఎన్నికల సంఘం...బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
మోదీ కోసం అవసరమైన చోట దొంగ ఓట్లు సృష్టించడం, కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రాంతాల్లో ఓట్లు తొలగించడం వంటి పనులను ఈసీ చేస్తోందని, తద్వారా తన స్వయంప్రతిపత్తిని కేంద్ర ఎన్నికల సంఘం కోల్పోయిందని ఆమె అన్నారు. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమైందని, అందుకే నకిలీ లాగిన్లతో దాదాపు 6 వేల ఓట్లను తొలగించారని ఆమె షాకింగ్ ఆరోపణలు చేశారు.
సాఫ్ట్ వేర్ హైజాక్ చేసి ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా ఓట్లన్నీ తొలగించడం దేశ ద్రోహంతో సమానమని షర్మిల అన్నారు. నకిలీ ధృవ పత్రాలు, తప్పుడు ఫోన్ నెంబర్లతో ఓట్లను అక్రమంగా తొలగించడం ఉగ్రవాదంతో సమానమని, తొలగించిన ఓటర్ల పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే అలా చేసిన వారికి ఈసీ రక్షణగా నిలుస్తుందని భావించాల్సి ఉంటుందని షర్మిల వార్నింగ్ ఇచ్చారు.