ఎవరెన్ని విమర్శలు చేసినా తమ పంథాను మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు మార్చుకోవడం లేదు. శాసనసభకు మాత్రం హాజరు కాబోమని, తమకు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా ప్రభుత్వం ఇవ్వాల్సిందేనని వైసీపీ ఎమ్మెల్యేలు చిన్నపిల్లల మాదిరిగా మారాం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధ్యక్షుడు జగన్ పై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
11 స్థానాలు గెలుచుకున్న పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలని ఎలా అడుగుతున్నారని జగన్ గూబ పగలగొట్టాలంటూ అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటమిపాలైన నేత అసెంబ్లీకి రావడం ఎంత తప్పో....జగన్ ప్రతిపక్ష హోదా కావాలని కోరడం కూడా అంతే తప్పని అచ్చెన్న అన్నారు. ప్రతిపక్ష హోదా గురించి ఆలోచించడం మానేయాలని, సభకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలని జగన్ కు హితవు పలికారు.
వైసీపీ ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్ పరిధిలో ఉందని, ఆ అంశంపై సభలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఇక, జగన్ పై శాసనమండలి విప్, టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన జగన్, వైసీపీ నేతలు బావిలో దూకాలని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయని బాధ్యతను జగన్ తీసుకోవాలని అన్నారు.
మండలిలో వైసీపీ సభ్యులు అనవసరమైన ప్రశ్నలు వేస్తున్నారని, పైగా వాటికి సమాధానం వినకుండానే సభ నుంచి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డ్ మెంబర్ గా కూడా గెలవని సజ్జల...కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. సభకు వచ్చి మాట్లాడితే సరే అని, అలా కాకుండా బయట నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.