‘మరక మంచిదే’ అన్న మాట వాణిజ్య ప్రకటనకు సూట్ అవుతుంది. వ్యక్తిత్వం పరంగా.. పొలిటికల్ కెరీర్ పరంగా చూసినప్పుడు విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ మీద ఉన్న మరకలు కాస్త ఎక్కువే. విలువలతో కూడిన రాజకీయాల గురించి మాట్లాడిన వేళలో బొండా లాంటి వాళ్ల గురించి తక్కువ మాట్లాడుకోవటం మంచిది. రాజకీయాల్లో ఈ తరహా నేతలు కామన్. అయితే.. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా చేసిన ఒక బరితెగింపు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మరకలున్నోళ్లు క్లీన్ చిట్ ఉన్నోళ్ల మీదా.. ట్రాక్ రికార్డు నీట్ గా ఉన్నోళ్లను లక్ష్యంగా చేసుకొని కామెంట్లు చేయటం కనిపించదు. అందుకు భిన్నంగా ఏపీ అసెంబ్లీ వేదికగా బొండా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో షాకింగ్ గా మారింది. ఎందుకంటే.. ఆయన ప్రధానంగా టార్గెట్ చేసిన పీసీబీ ఛైర్మన్ పి. క్రిష్ణయ్య విషయానికే వస్తే.. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడే కాదు.. వివాదరహితుడు. రిటైర్డ్ ఐఏఎస్ అయిన ఆయన ట్రాక్ రికార్డు చేసినా.. ఎక్కడా ఎలాంటి మచ్చ కనిపించదు.
ఇక.. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విషయానికి వస్తే.. ఆయనలో బంధుప్రీతి.. అధికార దుర్వినియోగం.. తన వాళ్లకు లాభం చేకూరేలా చేయాలన్న తత్త్వం పవన్ లో ఇసుమంత కూడా కనిపించదు. రాజకీయాల్లో కీలక భూమిక పోషించే ఒక పార్టీ అధినేత మీద తాటాకు చప్పళ్లు మాదిరి ఏదో నోటికి వచ్చినట్లుగా విమర్శలు చేయటమే తప్పించి. ఇప్పటివరకు ఎవరూ కూడా వేలెత్తి చూపించే ఆధారాన్ని పవన్ విషయంలో ప్రదర్శించలేకపోయారు. అంత పారదర్శకంగా రాజకీయాలు చేస్తున్న ఆయన్ను బొండా టార్గెట్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇద్దరు క్లీన్ చిట్.. ట్రాక్ రికార్డు ఉన్న ముఖ్యలను ఉద్దేశించి.. బొండా చేసిన వ్యాఖ్యలు.. కచ్ఛితంగా గీత దాటినట్లుగా కనిపిస్తున్నాయని చెప్పాలి. అంతేకాదు.. బొండా ఉమ స్థాయి ఏంటి? అన్నది ఏపీలోని అందరికి తెలిసిందే. అలాంటి నేత ఒకరు ఏకంగా డిప్యూటీ సీఎం మీదా.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖకు చెందిన ఒక కీలక అధికారి మీద నోటికి వచ్చినట్లుగా సభా ముఖంగా వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం సహించలేనిదిగా చెబుతున్నారు. ఇలాంటి తీరు కూటమి సర్కారుకు మంచిది కాదని.. మొగ్గలోనే దీన్ని తీసి పారేయాలన్న మాట వినిపిస్తోంది. మరి.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.