అమెరికాలో ప్రవాసాంధ్ర బాలిక ధాత్రిశ్రీ ఆళ్ళ భరత నాట్య రంగప్రవేశ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని శాక్రమెంటోలోని మెక్లంచి హైస్కూలు థియేటర్లో ఆగస్టు 9, 2025న ఈ కార్యక్రమం జరిగింది. ఆరేళ్ల వయసు నుంచే నాట్యంపై ధాత్రిశ్రీకి ఉన్న ఆసక్తిని ఆమె తల్లిదండ్రులు గుర్తించి భరత నాట్యంలో శిక్షణను ఇప్పించారు. మధుర విశ్వనాథన్ శిక్షణలో ధాత్రిశ్రీ తన 15వ ఏట భరతనాట్య రంగప్రవేశం కార్యక్రమానికి ఉపక్రమించింది.
ప్రాచీన నాట్య కళలకు అంతంత మాత్రంగా ప్రోత్సాహం ఉన్న ఈ రోజుల్లో తెలుగు తేజం ధాత్రిశ్రీ భరతనాట్యం ప్రదర్శించిన తీరు ఆద్యంతం అలరించింది. తన హావభావాలతో, నాట్య భంగిమలతో ధాత్రిశ్రీ దాదాపు 3 గంటలపాటు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా శాక్రమెంటో తెలుగు సంఘం చైర్మన్ శ్రీ మనోహర్ మందడి, వైస్ చైర్మన్ శ్రీ నాగ్ దొండపాటి హాజరయ్యారు.
భారతీయ సంస్కృతీసంప్రదాయాలలో భరత నాట్యం ఒక భాగమని, నాట్య వారసత్వాన్ని కొనసాగించడం యువతకు అత్యంత అవసరమని మనోహర్ చెప్పారు. నాట్యం వల్ల జీవితంతో సమతుల్యం ఏర్పడుతుందని, భావోద్వేగాలను మరింత మెరుగ్గా సమన్వయం చేసుకునే శక్తి భరతనాట్యం వల్ల పొందవచ్చని నాగ్ చెప్పారు. రాంచో కార్డోవా నగర మేయర్ ఇచ్చిన ప్రశంసా పత్రాన్ని తన గురువు మధుర చేతుల మీదుగా ఆహూతుల హర్షధ్వానాల నడుమ ధాత్రి శ్రీ అందుకుంది.
స్థానిక కళాధార నృత్య పాఠశాల ఆధ్వర్యంలో ప్రముఖ గురువు శ్రీమతి మధుర శిష్యురాలైన చిరంజీవి ధాత్రిశ్రీ భరతనాట్యం రంగప్రవేశం సంబంధిత పలు అంశలలో మనోహరంగా నృత్య ప్రదర్శన చేసింది. శ్రీమన్నారాయణ , జతిస్వరం , వర్ణం - వనజాక్షి , అర్ధ నారీశ్వర స్తుతి , తుంగ తరంగే గంగే, తిల్లాన మరియు హరివరాసనం తో ముగింపు మంగళం తో నృత్య ప్రదర్శన చేసి ఆమె భళా అనిపించింది. ఈ కార్యక్రమంకు ఆరు వందలకు పైగా స్థానిక శాక్రమెంటో ప్రవాసాంధ్రులు, మిత్రులు హాజరై చిరంజీవి. ధాత్రి ని అభినందించారు. కర్ణాటక సంగీత గాయకుడైన శ్రీ మురళి సంగీత్ ఆలపించిన వినాయకుడి ప్రార్ధనాగీతంతో కార్యక్రమం ప్రారంభం అయింది.
ధాత్రిశ్రీ తల్లిదండ్రులు శ్రీదేవి – శివ ఆళ్ళ ఆధ్యర్యంలో ఆత్మీయ అతిధులకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమం అనంతరం గురు శ్రీమతి. మధుర కు వారు సత్కారం చేశారు. ప్రవాసాంధ్రులు తమ పిల్లలకు సాంప్రదాయ భారతీయ కళలను పరిచయం చేయాలని, అప్పుడే ఘనత వహించిన భారతీయ కళా సాంప్రదాయం దేశం దాటి విదేశాలలో కూడా విరాజిల్లుతుంది అని పలువురు ఆహుతులు సూచించారు. ఈ కార్యక్రమం కు భారతదేశం నుండి ధాత్రిశ్రీ అమ్మమ్మ మరియు తాతయ్య విచ్చేసి కార్యక్రమం ఆసాంతం ప్రత్యక్షం వీక్షించి, ధాత్రిశ్రీ ని ఆశీర్వదించి సభాముఖంగా ఆమెకు ప్రశంసాపత్రం ను అందచేశారు.
ఈ భరతనాట్యం రంగప్రవేశం ప్రదర్శనకు శ్రీ వి మురళి సంగీత్ సభాపతి గాత్రం, శ్రీ నాగై శ్రీరాం మృదంగం, శ్రీ అనంతరామన్ బాలాజి వయోలిన్, శ్రీ డా వినోద్ కుమార్ వేణువు, శ్రీమతి అనురాధా సుకుమారన్ నట్టువాంగం వాద్య సహకారం అందించారు. చిరంజీవి. ధాత్రిశ్రీ మాట్లాడుతూ తనకు ప్రేమతో భరతనాట్యం విద్యను నేర్పించిన గురు శ్రీమతి. మధుర కు ధన్యవాదాలు తెలియజేసింది.
తన తల్లిదండ్రులకు, సోదరునికి, ఆత్మీయ అతిధులకు, భరతనాట్యం రంగప్రవేశం ప్రదర్శన ఆసాంతం తిలకించిన వీక్షకులకు, సహకారం అందించిన వాద్య బృందానికి వినమ్ర పూర్వకమైన కృతజ్ణతలు తెలియజేసుకుంటున్నాను అని చిరంజీవి. ధాత్రిశ్రీ చెప్పింది. ఈ సందర్భంగా థియేటర్ లాబీలో ప్రదర్శనకు ఉంచిన భరతనాట్య ఔన్నత్యాన్ని తెలిపే పలు కళాఖండాలు, చిత్రాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. స్థానిక ఫాల్సం రుచి రెస్టారెంట్ వారు ఆహుతులకు వండి , వడ్డించిన పసందైన తెలుగు భోజనంతో భరతనాట్యం రంగప్రవేశం కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది.