జగన్ హయాంలో అసైన్డ్ భూములు మొదలు ఆవ భూముల వరకు దేన్నీ వదలకుండా వైసీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కంటికి స్థలం కనిపిస్తే చాలు వైసీపీ నేతలు కబ్జా చేసేందుకు బరితెగించారని టీడీపీ నేతలు చాలా కాలంగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై తాజాగా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఆవ భూముల కుంభకోణంపై విజిలెన్స్ విచారణ ప్రకారం చర్యలు తీసుకుంటామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.
గత ప్రభుత్వం చాలా చోట్ల సెంటు భూమిలో నిర్మాణం కోసం ప్రజలకు కేటాయించిన స్థలాలు నిరుపయోగంగా, ఖాళీగా ఉన్నాయని ఆయన అన్నారు. అర్బన్ ప్రాంతాల ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడం వల్ల కొన్ని అభ్యంతరాలు వచ్చాయని పార్థసారథి చెప్పారు. అంతేకాకుండా టీడీపీ హయాంలో ఇచ్చిన టిడ్ కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారని అన్నారు.
జగనన్న కాలనీల నిర్మాణంలో దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి యూనిట్ ధర పెంచాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. జగనన్న కాలనీల కోసం చేపట్టిన భూసేకరణలో ఎన్నో అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అయినప్పటికీ ఆ ఇళ్లను ఆపకుండా నిర్మాణం పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని చెప్పారు.