వైసీపీ హయాంలో అమరావతి రాజధానిపై అ పార్టీ అధినేత జగన్ తో పాటు వైసీపీ నేతలంతా విష ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం పాలైనప్పటికీ ఆ దుష్ప్రచారం మాత్రం వైసీపీ నేతలు ఆపలేదు. వారితోపాటు కొంతమంది వైసీపీ అనుకూల ప్రభుత్వ ఉద్యోగులు కూడా అమరావతిపై ఇంకా విషం చిమ్ముతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అమరావతి రాజధాని మునిగిపోయింది అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన ఉద్యోగిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్ ఫేస్బుక్ లో యాక్టివ్ గా ఉంటుంటారు. ఈయన సమకాలీన రాజకీయాలు, సామాజిక అంశాలపై పోస్టులు పెడుతుంటారు. అయితే ఈయన వైసీపీకి అనుకూలంగా ఉండే వ్యక్తి అని సోషల్ మీడియాలో నెటిజన్ల అభిప్రాయం. ఈ క్రమంలోనే తాజాగా అమరావతిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయ్యాయి. ఆ ఫోటోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన సుభాష్ చంద్రబోస్ అమరావతి మునిగిపోయిందని క్యాప్షన్ పెట్టారు.
దీంతో ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని కొందరు నెటిజన్లు కోరారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ పోస్ట్ పెట్టిన సుభాష్ చంద్రబోస్ ను ప్రభుత్వం వివరణ కోరింది. అయితే అది తన వ్యక్తిగత అభిప్రాయమని దానికి తన ఉద్యోగానికి సంబంధం లేదని ఆయన వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ వివరణపై ప్రభుత్వం సంతృప్తి చెందకపోవడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.