ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ...ఈ ఇద్దరు ఓపక్క సినీ రంగంలో రాణిస్తూ మరోపక్క రాజకీయాల్లో కూడా సత్తా చాటుతున్నారు. ఒక పక్క సినిమాలు, షూటింగులతో బిజీగా ఉంటూనే మరొక పక్క అసెంబ్లీ సమావేశాలు, ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తూ తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరైన బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో బాలకృష్ణ ఆ సినిమాపై చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
ఎల్లుండి తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాబోతుందని, డిసెంబర్ 5న అఖండ 2 విడుదల కాబోతుందని బాలకృష్ణ చెప్పారు. ఈ రెండు చిత్రాలు ఘనవిజయం సాధించాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. అసెంబ్లీ లాబీలో కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు బాలకృష్ణతో చేసిన చిట్ చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అఖండ 2 చిత్రం ఎప్పుడు విడుదలవుతుందని బాలకృష్ణను వారు అడిగారు. దీంతో అఖండ 2 చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేయబోతున్నామని, పాన్ ఇండియా రేంజ్ లో వివిధ భాషల్లో ఆ చిత్రం విడుదల కాబోతుందని అన్నారు.
ఆ సినిమా హిందీ డబ్బింగ్ చాలా బాగా వచ్చినట్లుగా బోయపాటి తనతో చెప్పారని బాలయ్య అన్నారు. అన్ని భాషల్లో అఖండ 2 చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేలంతా పాటుపడాలని బాలయ్య బాబు సూచించారు. రాష్ట్రమంతా సమాన అభివృద్ధి జరుగుతుందని, కూటమిపాలనబట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని బాలకృష్ణ చెప్పారు. అరకు కాఫీని ప్రమోట్ చేస్తే గిరిజనుల ఉపాధికి లబ్ధి చేకూరుతుందని మంత్రి సంధ్యారాణి చేసిన సూచనకు బాలకృష్ణ సానుకూలంగా స్పందించారు.