వైసీపీ హయాంలో అసెంబ్లీ సాక్షిగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఇది గౌరవ సభ కాదని, కౌరవ సభ అని, అందుకే సభ నుంచి వెళ్లిపోతున్నానని చంద్రబాబు సభను బాయ్ కాట్ చేశారు. ఇది గౌరవ సభ గౌరవ సభగా మారిన తర్వాతే ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు శపథం చేశారు. ఆ మాట ప్రకారమే వైసీపీని మట్టికరిపించి అసెంబ్లీలో గౌరవంగా అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే నేడు శాసనమండలిలో ఆ విషయంపై వాడీ వేడి ర్చ జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిపై లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ సభ్యులు ఆరోపించారు.
వారి వ్యాఖ్యల పట్ల లోకేష్ తీవ్రంగా స్పందించారు. నిండు సభలో తన తల్లిని దారుణంగా అవమానించినప్పుడు మహిళల గౌరవం వైసీపీ సభ్యులకు గుర్తుకు రాలేదా అని లోకేష్ ప్రశ్నించారు. ఆనాడు మీరేం చేశారు సార్ అంటూ బొత్సను లోకేశ్ నిలదీశారు. ఆ అవమానం నుంచి కోలుకోవడానికి తన తల్లికి 3 నెలలు పట్టిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధ ఏంటో తనకు తెలుసని అన్నారు. తమ పార్టీ మహిళా నేతలపై అక్రమ కేసులు పెట్టినప్పుడు మీరేం చేశారని లోకేశ్ ప్రశ్నించారు.
మహిళలను అవమానించే వైసీపీ నేతలకు వారి గౌరవం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై చర్చ జరుగుతున్న సందర్భంగా ఈ విషయంపై లోకేష్ క్లారిటీనిచ్చారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి, ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విశాఖ ఉక్కు వంటి రాష్ట్ర ఆస్తులను కాపాడడంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని చెప్పారు.