మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో తనకు న్యాయం జరగడం లేదని వివేక కూతురు సునీత సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్య సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్య పై పలు ఆరోపణలు వచ్చాయి. శంకరయ్య సమక్షంలోనే నిందితులు ఆ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు మాయం చేశారని, అంతేకాకుండా రక్తపు మరకలను కడిగేశారని పలువురు టీడీపీ నేతలు, ఆఖరికి సీఎం చంద్రబాబు కూడా ఆరోపించారు.
ఆ తర్వాత శంకరయ్య పై సస్పెన్షన్ వేటు పడింది. కానీ, 2021లో వైసీపీ ప్రభుత్వం శంకరయ్యపై సస్పెన్షన్ ఎత్తివేసింది. శంకరయ్య విధులలో నిర్లక్ష్యం వహించిన విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా పలుమార్లు ప్రస్తావించారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు శంకరయ్య తాజాగా పరువు నష్టం నోటీసులు పంపడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. తన ప్రతిష్టకు భంగం కలిగించే లాగా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ఆరోపణలు చేశారని శంకరయ్య ఆ నోటీసులలో పేర్కొన్నారు.
శాసనసభ వేదికగా చంద్రబాబు తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు దాదాపు కోటిన్నర రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఆ నోటీసుల్లో శంకరయ్య పేర్కొన్నారు. శంకరయ్య విశ్వసనీయతపై ఆల్రెడీ చాలా విమర్శలు ఉన్నాయి. సిబిఐకి ఒక వాంగ్మూలం ఇచ్చిన శంకరయ్య ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు మరో స్టేట్మెంట్ ఇచ్చారు.
ఎంపీ అవినాష్ రెడ్డి ఒత్తిడితో కేసు నమోదు చేయలేదని సిబిఐకి శంకరయ్య ముందు తెలిపారు. అయితే మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం నమోదు చేసే సమయంలో దాటవేత ధోరణిని ప్రదర్శించారు.