పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడలో మత్స్యకారులు కొద్ది రోజులుగా ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. రసాయన పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్థాలతో తమ జీవనోపాధి దెబ్బతింటుందని మత్స్యకారులు రెండు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ వ్యవహారంపై తాజాగా పవన్ స్పందించారు. శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా మత్స్యకారులను కలవలేకపోతున్నానని అన్నారు.
అసెంబ్లీకి హాజరవుతున్న నేపథ్యంలో వారితో చర్చించలేకపోతున్నామని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వారి సమస్యల పరిష్కారానికి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తున్నానని పవన్ చెప్పారు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీస్, రెవెన్యూ ఉన్నతాధికారులతోపాటు కాకినాడ జిల్లా కలెక్టర్ ను కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులకు కూడా ఆ కమిటీలో స్థానం ఇస్తామన్నారు.
మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు మెరుగైన జీవన ఉపాధి, తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ఈ కమిటీ దృష్టిసారిస్తుందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత స్వయంగా తాను ఉప్పాడ మత్స్యకారులతో భేటీ అవుతానని, అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చిస్తానని పవన్ హామీనిచ్చారు. అంతేకాకుండా, ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే పరిష్కారం అయ్యేలాగా చూస్తానని భరోసానిచ్చారు.