మాజీ మంత్రి వివేకా హత్య జరిగిన రోజు డ్యూటీలో ఉన్న సీఐ శంకరయ్య వ్యవహారశైలిపై అప్పట్లోనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తో పాటు ఆయన అనుచరుడు శివ శంకర్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఘటనా స్థలంలో సాక్ష్యాధారాలు మాయం చేయడం, రక్తపు మరుకలు తుడిచి వేయడం వంటి చర్యలకు శంకరయ్య సహకరించారని ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలోనే ఆ ఆరోపణలను ప్రస్తావించిన సీఎం చంద్రబాబుకు శంకరయ్య పరువు నష్టం నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలోనే శంకరయ్యపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. వివేకా హత్య జరిగిన రోజు రక్తపు మరకలు కడుగుతున్న సమయంలో శంకరయ్య ఏం చేశారని ఆయన నిలదీశారు. వైసీపీ నేతల బెదిరింపులకు భయపడి ఆ రోజు ఏమీ చేయలేదని సీబీఐ విచారణలో ఆయన చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పోలీసు వ్యవస్థ పరువు తీశారని. శంకరయ్యపై తక్షణమే డీజీపీ గారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీఆర్ లో ఉన్న శంకరయ్యను ఉద్యోగం నుంచి తీసివేయాలని డిమాండ్ చేశారు.
సీఎం చంద్రబాబుకు పరువు నష్టం నోటీసులు పంపిస్తే తన ఉద్యోగం మళ్ళీ ఇస్తారన్న ఉద్దేశంతోనే శంకరయ్య ఇటువంటి పని చేసి ఉంటారని అన్నారు. చంద్రబాబుకు నోటీసులు పంపించే స్థాయి శంకరయ్యదా అని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి తదితరులు ఆయన వెనకుండి నడిపిస్తున్నారని ఆరోపించారు. వివేక హత్య కేసు నిందితులే శంకరయ్యను నడిపిస్తున్నారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. హంతకులతో శంకరయ్య కుమ్మక్కయ్యారని, వివేకా కేసులో ఆయన పాత్ర పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.