2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోరపరాభవం పాలైన సంగతి తెలిసిందే. వైసీపీ మాకొద్దు అంటూ ప్రజలు తిరస్కరించినా సరే ప్రతిపక్ష హోదాను ఇవ్వకపోయినా సరే జగన్ మాత్రం తమదే ప్రతిపక్షం అంటూ మారం చేస్తున్నారు. అయితే, అసెంబ్లీ రూల్స్ ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఈ ఏడాది ఫిబ్రవరి 5న వైసీపీకి ప్రతిపక్ష హోదా నిరాకరిస్తూ అసెంబ్లీలో రూలింగ్ పాస్ చేశారు. ఆ రూలింగ్ ను సవాల్ చేస్తూ వైసీపీ అధినేత జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీనే ప్రతిపక్ష పార్టీగా ఉందని గుర్తు చేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు తో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, పలువురు అధికారులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో జగన్ వేసిన పిటిషన్ ను కూడా ఈ పిటిషన్ కు కలపాలని ఆదేశాలు జారీ చేసింది. జగన్ వేసిన పిటిషన్ తదుపరి విచారణను అక్టోబర్ 9కి హైకోర్టు వాయిదా వేసింది.