టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీతోపాటు తెలంగాణలో సినిమా టికెట్ రేట్ పెంచుతూ ఆయా ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. అయితే, తాజాగా ఓజీ చిత్ర బృందానికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓజీ సినిమా బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపు అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమోను కోర్టు సస్పెన్షన్ లో పెట్టింది. అంతేకాకుండా ఓజీ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది.
రేపు చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు చిత్ర బృందానికి షాక్ ఇచ్చాయి. అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరో పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సినీ పెద్దలు సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. బెనిఫిట్ షో, ఓపెనింగ్ ,స్పెషల్ ప్రీమియర్ల టికెట్లు రేట్లు పెంపు లేకుంటే కలెక్షన్లు దెబ్బతింటాయని నిర్మాణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఓజీ టిక్కెట్ల రేట్ల పెంపును అనుమతిస్తూ తెలంగాణ హోం శాఖ జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ హైకోర్టులో మహేష్ యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఆ అనుమతి ఇచ్చేందుకు హోంశాఖ స్పెషల్ సీఎస్ కు ఎటువంటి అధికారాలు లేవని పిటిషన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అధిక రేట్లు ప్రేక్షకుల హక్కులను దెబ్బతీస్తున్నాయని వాదించారు.