పవన్ కళ్యాణ్ సినిమా మేకింగ్ దశలో ఉన్నపుడు ఎంత నెగెటివిటీ అయినా ఉండనీ.. రిలీజ్ టైం వచ్చిందంటే రావాల్సిన హైప్ అంతా వచ్చేస్తుంటుంది. పవన్ చేసే సినిమాలను కొన్నిసార్లు వ్యతిరేకించే అభిమానులే.. విడుదల సమయానికి నెగెటివిటీ అంతా పక్కన పెట్టి వాటిని మోస్తుంటారు. గత కొన్నేళ్లలో పవన్ చేసిన ప్రతి రీమేక్ సినిమానూ అభిమానులు గట్టిగా వ్యతిరేకించడం.. విడుదలప్పుడు మాత్రం తాము చేయాల్సిన డ్యూటీ చేయడం గమనించే ఉంటారు.
‘హరిహర వీరమల్లు’ విషయంలోనూ ఇదే జరిగింది. సరైన సినిమాలు చేయక పవన్ అభిమానులను నిరాశపరిచాడు కానీ.. ఫ్యాన్స్‌ను మాత్రం తప్పుబట్టడానికి ఏమీ కనిపించదు. తమ హీరో కోసం ఏం చేయాలో అదంతా చేస్తుంటారు ఫ్యాన్స్. పవన్ తన స్టామినాకు తగ్గ స్ట్రెయిట్ మూవీ చేయాలని, దాన్ని ఒక ట్రెండీ డైరెక్టర్ తీయాలని ఎప్పట్నుంచో వారికి కోరిక. అది ‘ఓజీ’తో నెరవేరింది. ఈ సినిమా వాళ్ల నిరీక్షణకు తెరదించి బ్లాక్‌బస్టర్ అవుతుందనే అందరూ ఆశిస్తున్నారు.
ఐతే విపరీతమైన హైప్ తెచ్చుకున్న ‘ఓజీ’ సినిమాకు చివరి నిమిషంలో కొన్ని ఇబ్బందులు తప్పలేదు.
ముఖ్యంగా ఓవర్సీస్‌లో సమయానికి కంటెంట్ డెలివరీ కాక ప్రిమియర్స్ మీద ప్రతికూల ప్రభావం పడే పరిస్థితి తలెత్తింది. అలాంటి సమయంలో అభిమానులే రంగంలోకి దిగి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‌కు అండగా నిలిచారు. యుఎస్‌లో కంటెంట్ షిప్మెంట్ తీసుకుని వివిధ ఏరియాలకు డిస్ట్రిబ్యూట్ చేయడంలో పవన్ ఫ్యాన్స్ సాయపడ్డారు. ట్విట్టర్లో కంటెంట్ డెలివరీ కోసం అప్పీల్స్ ఇవ్వడం.. వాటికి స్పందించి అభిమానులు రంగంలోకి దిగడం.. ఇలా పలు ఏరియాలకు అభిమానుల వల్లే సమయానికి కంటెంట్ చేరడం.. ఇదంతా చూసి, ఇలా చేయడం పవన్ అభిమానులకే సాధ్యం అంటూ కో ఫ్యాన్స్ వారికి కొనియాడుతున్నారు.
మొత్తానికి ప్రిమియర్స్ ముంగిట చాలా టెన్షన్ నెలకొన్నప్పటికీ.. పవన్ అభిమానుల సపోర్ట్ వల్ల చాలా వరకు సమస్య క్లియరైనట్లే. బుధవారం ప్రిమియర్స్‌లో కొన్ని షోలు మినహాయిస్తే దాదాపుగా చాలా వరకు ఆన్ టైం మొదలయ్యేలాగే కనిపిస్తున్నాయి.