బాలీవుడ్లో నటుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న అనుపమ్ ఖేర్.. రచయితగా, దర్శకుడిగానూ ప్రతిభ చాటుకున్నవాడే. ఆయన కొన్నేళ్ల ముందు ‘తన్వి.. ది గ్రేట్’ అనే ఉదాత్తమైన సినిమాను మొదలుపెట్టారు. ఎన్నో కష్టాలకు ఓర్చి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందాయి కానీ.. బాక్సాఫీస్ విజయం మాత్రం దక్కలేదు.
‘సైయారా’ వల్లే తన సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుందంటూ అనుపమ్ ఖేర్ ఆవేదన చెందారు. ‘సైయారా’ మంచి సినిమానే అని.. కానీ దాని వల్ల అంతకంటే మంచి సినిమా అయిన ‘తన్వి.. ది గ్రేట్’ దెబ్బ తిందని ఆయన అన్నారు. ‘తన్వి ద గ్రేట్’ సినిమా కోసం తాను పడ్డ కష్టాలు, రిలీజ్ తర్వాత ఎదురైన ఇబ్బందుల గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
‘‘తన్వి ద గ్రేట్ సినిమా కోసం నేను నాలుగేళ్ల సమయాన్ని వెచ్చించాను. స్క్రిప్టు కోసమే ఏడాది పట్టింది. సంగీతం కోసం ఇంకో ఏడాది పాటు పని చేశాం. ఈ సినిమా మేకింగ్‌లో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. సినిమా పూర్తి చేయడానికి ఆర్థిక సమస్యలు తలెత్తాయి. పెద్ద బడ్జెట్ సినిమా కావడంతో డబ్బుల కోసం చాలామందిని అడిగాను. నా స్నేహితులు ఆర్థిక సాయం చేశారు. ఈ చిత్రాన్ని కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించాం. భారత రాష్ట్రపతికి కూడా చూపించాం. అందరూ ప్రశంసలు కురిపించారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఆదరించలేదు.
యశ్ రాజ్ వాళ్ల ‘సైయారా’తో పాటు రిలీజ్ కావడం మా సినిమాను దెబ్బ తీసింది. ఆ సమయంలో ప్రపంచం ఒక ప్రేమకథను చూడాలనుకుంది. ‘సైయారా’కు ఆదరణ దక్కింది. ఇక్కడ రెండు సినిమాలు రిలీజైతే.. ఒక చిత్రం కోసం వేరే సినిమా కేవలం 400 థియేటర్లలో మాత్రమే ఆడుతున్నా సరే దాన్ని నిర్మొహమాటంగా తీసేస్తారు. ‘సైయారా’ ముందు మా సినిమా నిలవలేకపోయింది. డిజాస్టర్ అయింది. దీంతో ఆ సినిమా కోసం కష్టపడ్డ 200 మంది చాలా బాధపడ్డారు’’ అని అనుపమ్ ఖేర్ తెలిపాడు.