జగన్ హయాంలో తిరుమల తిరుపతి ప్రతిష్ట మసకబారిందని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ పాలనలో తిరుమలలో అన్యమత ప్రచారం జోరుగా సాగిందని ఆరోపణలు వచ్చాయి. ఇక, తిరుపతి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో సమూల ప్రక్షాళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏఐ టెక్నాలజీతో అత్యాధునిక వసతి సముదాయాన్ని ప్రారంభించారు.
ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు వెంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయం పీఏసీ 5 భవనాలను ప్రారంభించారు. ముందస్తుగా బుకింగ్ లేకున్నా సరే భక్తులకు వసతి కల్పించేలా 102 కోట్ల రూపాయల వ్యయంతో నూతన కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. 4000 మందికి వసతి కల్పించేలాగా దీనిని నిర్మించారు. 16 డార్మెటరీలు, 2400 లాకర్లు, 24 గంటలు వేడి నీటి సదుపాయం ఇందులో ఉన్నాయి.
ఇక పిఎసి5 ప్రాంగణంలో ఒకేసారి 80 మంది తలనీలాలు సమర్పించేలాగా కళ్యాణకట్ట ఏర్పాటు చేశారు. 1400 మంది ఒకేసారి భోజనం చేసేందుకు వీలుగా రెండు డైనింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. బుకింగ్ కౌంటర్ ను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. తొలి టోకెన్ ను భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.