పులివెందుల ఎమ్మెల్యే జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానిపై జగన్ తాజా వైఖరి ఏంటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతిపై జగన్ ప్రకటన చేయాలని కోరారు. మూడు రాజధానులకు జగన్ కట్టుబడి ఉన్నారా లేదా స్పష్టం చేయాలని నిలదీశారు. గత ప్రభుత్వంలో సకల శాఖ మంత్రి గా పేరు తెచ్చుకున్న సజ్జల అమరావతిపై ప్రకటన చేస్తే సరిపోదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పలేక సిగ్గుపడే పరిస్థితిని జగన్ సృష్టించారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరుగులు పెట్టిస్తున్నారని కితాబిచ్చారు. కరోనా రెండో దశ రాదని తనకు రాత్రి కలలో ప్రభువు చెప్పారని ఓ ఐఏఎస్ అధికారితో జగన్ చెప్పిన విషయాన్ని కామినేని గుర్తు చేశారు. ఆ వెంటనే కరోనా రెండో దశ మొదలైందని, పంచాయతీ ఎన్నికలను అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వాయిదా వేశారని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత జగన్ ఉగ్ర రూపం చూసి అధికారులు భయపడ్డారని అన్నారు. ఆ పరిస్థితిలో జగన్ మాట విని పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉంటే రాష్ట్రంలో ఎంతో మంది కరోనాతో చనిపోయి ఉండే వారని అన్నారు.
అటువంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి జగన్ అని, ఆయన ఎవరికీ అర్థం కాడని శ్రీనివాస్ అన్నారు. సభకు రాకపోయినా ఇంటి దగ్గర నుంచైనా అమరావతి రాజధానిపై తన అభిప్రాయం ఏంటో జగన్ స్పష్టం చేయాలని కామినేని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇక దాదాపుగా ఇదే తమకు చివరి టర్మ్ అని, ఈ ప్రభుత్వం ఉండగానే అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి పొంగూరు నారాయణను శ్రీనివాస్ కోరారు.