శాసనమండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి పయ్యావుల కేశవ్ నిప్పులు చెరిగారు. ఉద్యోగులకు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, అందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని పయ్యావుల ఎద్దేవా చేశారు. ఆ వాగ్దానాలు అమలు చేసి ఉంటే వైసిపికి ఈ దుస్థితి వచ్చేది కాదని పయ్యావుల అన్నారు. పీఆర్సీ రివిజన్ బకాయిల చెల్లింపు అంశంపై మండలిలో వాడి వేడి చర్చ జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వైసీపీ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరించిందని పయ్యావుల ఆరోపించారు.
ఆఖరికి ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్మును సైతం జగన్ ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడడం సిగ్గుచేటని పయ్యావుల విమర్శించారు. ఇప్పుడు ఉద్యోగుల గురించి వైసీపీ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మండిపడ్డారు. ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు. కరోనా పేరు చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దానికంటే ఎక్కువ నిధులను గత ప్రభుత్వం తీసుకుందని అన్నారు.
కరోనా పేరు చెప్పి ఉద్యోగుల ఫిట్మెంట్ ను వైసీపీ ప్రభుత్వం తగ్గించిందని, ఐఆర్ కంటే 23% తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు వైసీపీ సర్కార్ రివర్స్ పిఆర్సి ఇచ్చిందని విమర్శించారు. ఉద్యోగులకు జగన్ సర్కార్ పెట్టిన బకాయిలను దశలవారీగా చెల్లిస్తున్నామని చెప్పుకొచ్చారు. పిఆర్సి కమిషన్ నియామకంపై కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఈ విషయంపై చంద్రబాబు సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అయితే, ఉద్యోగులకు తాము సంఘీభావం ప్రకటిస్తున్నామని, కాబట్టి సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని బొత్స వెల్లడించారు. దీంతో, పయ్యావుల దెబ్బకు బొత్స వాకౌట్..వైసీపీ నాకౌట్ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.