ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా నిన్న చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాలకే కాకుండా సినీ ఇండస్ట్రీ వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారి తీసాయి. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, అనంతరం చిరంజీవి ఇచ్చిన స్పందన రెండూ హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈ అంశాన్ని వక్రీకరించి, రాజకీయ లబ్దీ కోసం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
అసెంబ్లీలో సినీ ప్రముఖులకు గతంలో జరిగిన అవమానంపై బాలయ్య స్పష్టత ఇచ్చారు. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ కలిసారు అని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వాదనను బాలయ్య తప్పుబట్టారు. చిరంజీవి గట్టిగా అడిగితేనే అప్పటి సీఎం దిగివచ్చి కలిసారన్నది అబద్ధం. దానిని ఖండిస్తున్నానని బాలయ్య వ్యాఖ్యానించారు. అదీ కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు వెళ్లే సినీ ప్రముఖుల బృందంలో తన పేరును తొమ్మిదో స్థానంలో ఉంచడంపై సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్‌ను ను నేరుగా ప్రశ్నిస్తూ బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే తప్ప ఆయన ఎక్కడా చిరంజీవిని వ్యక్తిగతంగా విమర్శించలేదు.
అలాగే చిరంజీవి కూడా తనవైపు నుంచి పెద్దగా వివాదం రేకెత్తకుండా, ఆ సమయంలో జరిగిన పరిణామాలనే ప్రస్తావించారు. బాలకృష్ణ మాటలను తప్పు పట్టలేదు. సినీ రంగం సమస్యలపై అప్పటి పరిస్థితులను మాత్రమే గుర్తు చేశారు. అయితే, అసెంబ్లీలో జరిగిన ఈ చిన్నపాటి చర్చను వైసీపీ విపరీతంగా వాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతోందన్నట్టుగా యుద్ధ వాతావరణం సృష్టిస్తోంది. బాలయ్య వర్సెస్ చిరంజీవి రగడగా మలిచి
మెగా అభిమానులు, నందమూరి అభిమానుల మధ్య విభేదాలు రేపాలని ప్రయత్నిస్తోంది. వాస్తవానికి ఇద్దరు సీనియర్ స్టార్స్ మధ్య వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవు. కానీ రాజకీయ లాభం కోసం విపరీతంగా ఓవర్ యాక్షన్ చేస్తోంది వైసీపీ.