వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే గాని అసెంబ్లీకి రానని వైసీపీ అధినేత జగన్ మంకు పట్టి పట్టిన సంగతి తెలిసిందే. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కావాలంటూ వైసీపీ సభ్యులు కూడా మారం చేస్తూ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. అయితే, ఆరు నెలల పాటు అసెంబ్లీకి హాజరు కాకుండా ఉంటే సభ్యుల సభ్యత్వం రద్దు చేయవచ్చు అంటూ నిబంధన ఉంది.
ఈ నేపథ్యంలోనే ఆ గడువు ముగిసేలోపు అసెంబ్లీకి ఓసారి వచ్చి అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు వైసిపి నేతలు. ఏదో మమ అంటూ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ సభ్యులకు చెక్ పెట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించబోతున్నారు. అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
డిసెంబర్ లో జరగబోతున్న శీతాకాల సమావేశాల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం ద్వారా హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రకారం ఇప్పటికే సాఫ్ట్ వేర్ కూడా రూపొందించినట్లుగా తెలుస్తోంది. మిగతా పార్టీలకు చెందిన కొందరు నేతలు కూడా సంతకం పెట్టి కొన్నిసార్లు వెళ్ళిపోతున్నప్పటికీ మెజారిటీగా వైసిపి సభ్యులు ఈ రిజిస్టర్ ను దుర్వినియోగం చేస్తున్నారు. వారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తేబోతుందని తెలుస్తోంది.