భూమి మీద నుంచి ఆకాశానికి.. నీరుపై నుంచి ఆకాశానికి.. ఆకాశం నుంచి ఆకాశానికి ప్రయోగించే క్షిపణి ప్రయోగాల గురించి విని ఉంటాం. అందుకు భిన్నంగా కదిలే రైలు నుంచి నింగిలోకి దూసుకెళ్లేలా అగ్ని క్షిపణిని సంధించే ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన ఘనతను భారత రక్షణశాఖకు సంబంధించిన సంస్థలు సొంతం చేసుకున్నాయి. ఈ తరహా ప్రయోగం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. రైలు నుంచి సంధించే ఈ క్షిపణి 2వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాల్ని ధ్వంసం చేసే సామర్థ్యం ఉంది.
రైలుపై ఈ తరహా క్షిపణి పరీక్ష చేయటం ఇదే మొదటిసారి కావటం గమనార్హం. భారత రక్షణ రంగంలో ఒక మైలురాయిగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభివర్ణించారు. అతి తక్కువ వెలుతురులోనూ.. అతి తక్కువ సమయంలోనూ ఈ క్షిపణిని ప్రయోగించే వీలుందన్న రాజ్ నాత్.. ‘మొబైల్ లాంచర్ ద్వారా క్షిపణి పరీక్ష చేయగల సామర్థ్యం అతి కొద్ది దేశాలకు మాత్రమే ఉంది. ఇప్పుడు వాటి సరసన భారత్ చేరింది. రక్షణ వ్యవస్థకు ఇది అదనపు బలాన్ని చేకూరేలా చేస్తోంది’’ అని పేర్కొన్నారు.
దేశంలో అత్యంత భారీ నెట్ వర్కు ఉన్న రైలు వ్యవస్థ సంగతి తెలిసిందే. దీంతో.. రైలు నుంచి అగ్ని క్షిపణిని సంధించటం ద్వారా.. లక్ష్యాల్ని చాలా సులువుగా.. అతి తక్కువ సమయంలో ప్రయోగించటంతో పాటు.. లాంచింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని చెబతున్నారు. ఇప్పటికే ఈ అగ్నిక్షిపణి పలు పరీక్షల్లో సామర్థ్యాన్ని నిరూపించిందని చెప్పాలి. వాహనంపై అగ్ని ప్రైమ్ క్షిపణిని ఇప్పటికే పరీక్షించి.. సైన్యంలోకి తీసుకొచ్చారు.