టీడీపీ ఎమ్మెల్యే.. హిందూపురం అసెంబ్లీ సభ్యుడు నందమూరి బాలకృష్ణ.. అసెంబ్లీలో గురువారం చేసిన వ్యాఖ్యలు రాజకీయ సెగ పుట్టించాయి. అయితే.. ఆయన ఉద్దేశం ఎలా ఉన్నా.. మెగా స్టార్ చిరంజీవిని కార్నర్ చేస్తూ.. ఆయన పేరు ఎత్తకుండానే `వాడు.. ఎవడు..`అని చేసిన వ్యాఖ్యలు.. అధికార పక్షంలోని మెజారిటీ సభ్యులకు ఆవేదన కలిగించాయి. వాస్తవానికి జనసేన పార్టీ ప్రజల్లో ఇమేజ్ సంపాయించుకోవడంలో మెగాస్టార్ పాత్ర కూడా ఉంది. పైకి ఆయన ప్రజల మధ్యకు రాకపోయినా.. గత ఎన్నికల సమయంలో తన సోదరుడు పవన్ కల్యాణ్ విజయం సహ.. పార్టీ విజయంపై సెల్పీ వీడియో విడుదల చేశారు.
దీంతో అప్పటి వరకు తటస్థంగా ఉన్న కాపు నాయకులు కూడా ఏకమయ్యారు. ఇది జనసేనకు కలిసి వచ్చింది. పవన్ ఇమేజ్ ఎంత ఉన్నా.. దండలో దారం మాదిరిగా మెగాస్టార్ ఇమేజ్ కూడా జనసేనకు కలిసి వస్తోంది. ఇలాం టి సమయంలో టీడీపీలో కీలక నాయకుడిగా ఉన్న బాలయ్య సభలోనే చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, పేల్చిన మాటల తూటాలు .. తీవ్రంగా కుదిపి వేశాయన్నది వాస్తవం. దీంతో కూటమి నాయకుల్లోనే విస్మయం వ్యక్తమైంది. చాలా మంది టీడీపీ నాయకులు కూడా అంతర్గత సంభాషణల్లో .. బాలయ్య వ్యాఖ్యలు సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏంటి వివాదం?
గురువారం నాటి సభలో.. బీజేపీ కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో సినిమా నిర్మాతలను, హీరోలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని తెలిపారు. అప్పట్లో సీఎం జగన్‌తో చర్చించేందుకు చిరంజీవి నేతృత్వంలో బృందం వచ్చిందని.. కానీ, సీఎం వారికి అప్పాయింట్‌మెంటు ఇవ్వకుండా.. అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో భేటీ కావాలని సూచించారని తెలిపారు. అయితే.. ఈ విషయంలో చిరంజీవి పట్టుబట్టి.. ``సీఎం అయితేనే తాము మాట్లాడతామని చెప్పారు. దీంతో అప్పటికప్పుడు సీఎం జగన్ వారితో భేటీ అయ్యారు. చిరంజీవి కనుక అడగకపోయి ఉంటే సీఎం భేటీ అయ్యేవారు కాదు.`` అని అన్నారు.
బాలయ్య ఏమన్నారు?
ఈ వ్యాఖ్యలపై స్పందించిన బాలయ్య.. ``ఆయన(కామినేని) చెప్పింది తప్పు. రాంగ్. ఎవడో.. వాడు.. ఏమీ కోరలేదు. ఆ సైకోగాడ్ని(జగన్) కలుస్తానని పట్టు బట్టలేదు. ఏమీ చేయలేదు. కేవలం వచ్చారంతే. చివరకు.. తప్పని పరిస్థితి లో వాడ్ని(జగన్) కలిశారు. వాడేదో(చిరు) చేశాడు.. ఎవడో ముందుకు వచ్చాడు.. అనేది తప్పు. నాకు కూడా సమాచా రం ఇవ్వలేదు. నేను వచ్చి ఉంటే వేరే గా ఉండేది. దీనిని వక్రీకరించారు. ఆయనకు(కామినేని) ఏం తెలుసని ఇప్పుడు మాట్లాడుతున్నాడు.`` అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు టీడీపీ-జనసేన ల మధ్య దూరం పెంచుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.