రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చాక పెద్ద సినిమాలకు అదనపు రేట్లు, షోలు ఇవ్వడంలో ఏ ఇబ్బందులూ లేకపోయాయి. ఏపీలో ఇప్పటికీ ఆ పరిస్థితి కొనసాగుతోంది. ఇక ముందూ కొనసాగేలానే కనిపిస్తోంది. కానీ తెలంగాణలో మాత్రం గత ఏడాది చివర్లో ‘పుష్ప’ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్లో చోటు చేసుకున్న విషాదంతో పరిస్థితి మారిపోయింది. అది పెద్ద వివాదంగా మారి.. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, ఎక్స్‌ట్రా షోలు ఉండవని.. అదనపు రేట్లకూ అవకాశం లేదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే ప్రకటించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఆ ప్రకారమే.. తర్వాత చాలా సినిమాలకు జీవోలు ఇవ్వలేదు. ఐతే జులై నెలాఖర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రం ప్రత్యేకంగా జీవో వచ్చింది. అదనపు రేట్లు ఇచ్చారు. ముందు రోజు ఒక బెనిఫిట్ షోకు కూడా అనుమతి ఇచ్చారు.
ఐతే చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అనే మెలికతో ‘వీరమల్లు’కు ఈ సౌలభ్యం కల్పించినట్లు వార్తలు వచ్చాయి. రెండు వారాల తర్వాత వచ్చిన వార్-2, కూలీ చిత్రాలకు ఎంత ట్రై చేసినా అదనపు రేట్లు, షోలు ఇవ్వలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఒక స్టాండ్ మీద ఉందని.. ఇకపై మామూలు సినిమాలకు రేట్ల పెంపు ఉండదని అందరూ ఫిక్సయిపోయారు. ప్రేక్షకుల కోణంలో చూస్తే ఇది మంచి నిర్ణయమే అనిపించింది. ఏపీతో పోలిస్తే ఆల్రెడీ ఇక్కడ టికెట్ల ధరలు ఎక్కువే కాబట్టి ఆడియన్స్ నుంచి ఈ విషయంలో హర్షం వ్యక్తమైంది. కానీ తాజాాగా పవన్ కొత్త సినిమా ‘ఓజీ’కి వచ్చేసరికి మళ్లీ స్టాండ్ మారిపోయింది. ఇదేమీ ‘వీరమల్లు’ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కాదు. అయినా ముందు రోజు బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చారు. దానికి రూ.800 రేటు పెట్టారు. పది రోజుల పాటు టికెట్ల ధరలు పెంచుకునే సౌలభ్యమూ కల్పించారు. దీని మీద తాజాగా కోర్టుకు వెళ్తే.. టికెట్ల ధరలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. మళ్లీ దానిపై స్టే వచ్చింది. దీంతో రేట్ల పెంపు ప్రకారమే టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా కోర్టు తీర్పు నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లైన్లోకి వచ్చారు. ఓజీ సినిమాకు టికెట్ల ధరల పెంపు జీవో తనకు తెలియకుండా వచ్చిందన్న కోమటిరెడ్డి.. ఈ జీవో జారీ చేసిన హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా ఒకటే రేటు ఉంటుందని.. సామాన్యులపై భారం పడకుండా టికెట్ల ధరలు పెంపు లేకుండా చూస్తామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. రేట్లు పెంచినపుడల్లా వివాదం చోటు చేసుకుంటుండడంతో తెలంగాణ ప్రభుత్వం ఇకపై ఈ విషయమై ఓకే స్టాండుతో ఉండబోతోందని స్పష్టమవుతోంది.