జగన్ తప్పుల చిట్టా జపంతోనే సరిపెడతారా చంద్రబాబు?

admin
Published by Admin — September 26, 2025 in Andhra
News Image

అసెంబ్లీ సమావేశాల ఉద్దేశం ఏమిటి? గతంలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగేవి? గడిచిన కొన్ని దశాబ్దాలుగా వచ్చిన మార్పేంటి? పదేళ్లలో చోటు చేసుకున్నకొత్త కల్చర్ ఏమిటి? లాంటి ప్రశ్నలు వేసుకుంటే.. తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నపరిస్థితి. గడిచిన పదేళ్లలో తెలుగు రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులు.. కొత్త రాజకీయ చిత్రానికి తెర తీసింది. గతంలో రాజకీయం వేరు.. వ్యక్తిగతం వేరన్నట్లుగా ఉండేది. నేతల మధ్య బంధం బయటకు ఒకలా ఉన్నా.. తెర వెనుక లెక్కలు వేరేలా ఉండేవి. కానీ.. పరిస్థితులు మారిపోయాయి. ఈ మార్పు మొదలైంది 2004లోఅని చెప్పాలి. దివంగత మహానేత వైఎస్సార్ చేతికి అధికారం రావటంతో తెలుగు రాజకీయాల్లో సమీకరణాలు మారిపోయాయి.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటి మూడేళ్ల పాలనకు భిన్నమైన వాతావరణం నాలుగో ఏడాది నుంచి మొదలైందని చెప్పాలి. అప్పటివరకు రాజకీయంగా ఉండే విభేదాలు ఉన్నప్పటికి.. వ్యక్తిగత స్థాయిలో ఉండని పరిస్థితి. అందుకు భిన్నంగా తర్వాతి రోజుల్లో రాజకీయం మొదలైంది. అసెంబ్లీ వేదికగా అప్పటి విపక్ష నేత చంద్రబాబును వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాటలతో విరుచుకుపడినప్పటికి చర్యల వరకు వచ్చేసరికి మాత్రం అలాంటివి కనిపించని పరిస్థితి. ఈ సందర్భంగా గతాన్ని గుర్తు చేసుకుంటే.. తన ముందు ప్రభుత్వాన్నినడిపిన చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్న అంశాల మీద విచారణ కమిటీ వేయటం.. చివరకు ఆధారాలు లభించక చర్యలు తీసుకోని పరిస్థితి.

దీంతో రాజకీయంగా ఎన్ని విబేధాలు ఉన్నప్పటికీ.. వ్యక్తిగతంగా టార్గెట్ చేయని పరిస్థితి రాలేదన్నది అర్థమైంది. తమిళనాడు రాజకీయాల్లో మాదిరి పరిస్థితి అప్పటికి తెలుగు రాష్ట్రంలో కనిపించేది కాదు. కానీ.. ఆ మార్పు మొదలైంది మాత్రం 2009 నుంచి అని చెప్పాలి. ఏడాదికేడాది ఇది పెరుగుతూ వచ్చి.. చివరకు చంద్రబాబు జైలుకు వెళ్లే వరకు వచ్చింది. రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అధినేతలు మొదలు నేతల వరకు వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఎక్కువైంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ.. రాష్ట్ర విభజన తర్వాత ఎప్పుడూ చూడని రాజకీయ వాతావరణం అటు జగన్ ప్రభుత్వంలోనూ.. ఇటు కేసీఆర్ సర్కారులోనూ తెలుగు రాష్ట్రాలు చూశాయి.

దీంతో.. అంతవరకు ఉన్న రాజకీయ లెక్కలు పూర్తిగా మారిపోయిన పరిస్థితి. అసెంబ్లీ నిర్వహణలోనూ మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అధికారంలో ఎవరున్నా.. అసెంబ్లీ సమావేశాల్లో వారి ప్రత్యర్థులు సభలో ఉండని పరిస్థితి. కారణాలు ఏమైనప్పటికి.. ఒకేలాంటి సీన్ కనిపిస్తున్న పరిస్థితి. దీంతో.. రెండు దశాబ్దాల క్రితం అసెంబ్లీ సమావేశాలు అన్నంతనే.. టీవీల్లో ప్రసారమయ్యే లైవ్ ను తెగ ఆసక్తిగా చూసే స్థాయి నుంచి.. అసెంబ్లీ సమావేశాలు రొడ్డు కొట్టుడుగా మారిపోయిన దుస్థితి.

తాజాగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్నే తీసుకోండి. కూటమి సర్కారు కొలువు తీరి ఏడాదిన్నర కావొస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైంది మొదలు ఇప్పటివరకు జరిగిన ప్రతి అసెంబ్లీ సమావేశంలోనూ గత ప్రభుత్వ వైఫల్యాల మీదా.. జగన్ పాలనలో చోటు చేసుకున్నపరిణామాల మీదా విమర్శలతో సరిపోతోంది. విపక్షం లేకుండా అధికారపక్షం మాత్రమే హాజరయ్యే సమావేశాల్లో కనిపించే సన్నివేశం.. ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా సాగుతోంది. జగన్ ప్రభుత్వంలోనూ అలాంటి సన్నివేశమే కనిపించింది. జగన్ హయాంలో జరిగిన తప్పుల చిట్టాల్ని అదే పనిగా వల్లెవేసే బదులు.. వాటిని నిరూపించే అంశాల్ని ప్రస్తావించి.. చర్యల దిశగా ఎందుకు అడుగులు పడాలి. అప్పుడు చెప్పే మాటలకు అంతో ఇంతో అర్థం ఉంటుందన్న విషయాన్ని కూటమి సర్కారు గుర్తిస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది.

Tags
Jagan chandrababu YCP leaders action
Recent Comments
Leave a Comment

Related News