ఒక సూపర్ స్టార్ కొడుకు హీరో అవ్వాలనే ప్రయత్నిస్తాడు సాధారణంగా. కానీ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మాత్రం భిన్నమైన దారిలో నడిచాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దర్శకుడిగా మారాడు. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ద్వారా 27 ఏళ్ల వయసులోనే అతను దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఇది ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ టాప్ వ్యూయర్‌షిప్ దక్కించుకున్న షోల్లో ఒకటిగా నిలిచింది.
విడుదలైనప్పటి నుంచి ఈ సిరీస్‌కు స్పందన చాాలా బాగుంది. ఐతే ఈ సిరీస్ ఇలాంటి ఆదరణ దక్కించుకోవడంలో వివాదాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో రణబీర్ కపూర్ ఈ-సిగరెట్ తాగే సీన్ మీద.. అలాగే ‘సత్యమేవ జయతే’ నినాదం తర్వాత వచ్చే సన్నివేశాల మీద అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాటి గొడవ నడుస్తుండగా.. తాజాగా మరో పెద్ద వివాదం సిరీస్‌ను చుట్టుముట్టింది.
ఈ సిరీస్‌లో తనను పోలిన పాత్రను పెట్టడం పట్ల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను తప్పుగా చూపించారని.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను పట్ల కూడా తప్పుడు అభిప్రాయం కలిగించేలా సన్నివేశాలు ఉన్నాయని.. ఇందుకుగాను తనకు ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ మేకర్స్ రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని సమీర్ వాంఖడే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఐతే ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీలోనే ఈ పిటిషన్ ఎందుకు వేశారని అడగ్గా.. ఈ సిరీస్ రిలీజయ్యాక తనకు, నార్కోటిక్స్ బ్యూరోకు వ్యతిరేకంగా ట్రోల్స్ వస్తున్నాయని.. అందులో ఎక్కువగా ఢిల్లీ నుంచే ఉన్నాయని సమీర్ తరపు లాయర్ వాదించారు. దీన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఢిల్లీ నుంచే ఎక్కువ పరువు నష్టం కలిగినట్లయితే.. ఆమేరకు మళ్లీ పిటిషన్ వేసుకోవాలని సూచించింది.
మూడేళ్ల ముందు ముంబయిలోని ఒక క్రూజ్ షిప్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న ఆరోపణలతో ఆర్యన్ ఖాన్ సహా కొందరిని సమీర్ వాంఖడే టీం అరెస్ట్ చేసింది. అప్పుడు ఆర్యన్ ఖాన్‌ను అందరూ దోషిలా చూశారు. కానీ కొంత కాలానికి ఈ కేసు నుంచి అతను నిర్దోషిగా బయటికి వచ్చాడు. రెండేళ్ల పాటు ఎవరికీ కనిపించని అతను.. సైలెంట్‌గా ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్ తీసి దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఇది సూపర్ హిట్ అయి తన మీద ఉన్న మరకలను చెరిపివేసింది. తనను అరెస్ట్ చేసిన సమీర్ వాంఖడేను పోలిన పాత్రను పెట్టి అతడిపై కావాల్సినన్ని సెటైర్లు వేశాడు ఆర్యన్. ఇప్పుడు సమీర్ పిటిషన్‌ను కోర్టు కొట్టేయడంతో రెండోసారి తనపై ఆర్యన్ గెలిచినట్లు అయింది.