తమ అసిస్టెంట్లను, రైటర్లను దర్శకులను చేయాలని తపించే పెద్ద మనసు అందరు దర్శకులకూ ఉండదు. చాలా తక్కువమంది డైరెక్టర్లు మాత్రమే అసిస్టెంట్లను దర్శకులుగా తీర్చిదిద్దడం మీద శ్రద్ధ పెడతారు. ప్రస్తుతం తెలుగులో అలా తపించే దర్శకుల్లో ముందు వరుసలో చెప్పుకోవాల్సిన పేరు సుకుమార్‌దే.
టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీకాంత్ ఓదెల (దసరా), బుచ్చిబాబు సానా (ఉప్పెన), సూర్యప్రతాప్ పల్నాటి (కుమారి 21 ఎఫ్) సహా పలువురు దర్శకులు సుకుమార్ శిష్యులే అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సుక్కు ఇంకో ఇద్దరు దర్శకులను తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. ‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలకు రచయితగా పని చేసిన వీరా కోగటంతో పాటు హేమంత్ అనే మరో కుర్రాడిని సుకుమామర్ దర్శకులుగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు.
వీరా కోగటం చెప్పిన ఒక క్రైమ్ థ్రిల్లర్ కథ మీద సుకుమార్ ఆమోద ముద్ర పడింది. గత ఏడాది ‘క’ సినిమాతో మంచి బ్రేక్ అందుకుని మళ్లీ ట్రాక్ ఎక్కిన యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ఈ చిత్రంలో లీడ్ రోల్ చేయబోతున్నాడు. కథ బాగా నచ్చడం, పైగా సుకుమార్ ముద్ర పడ్డ కథ కావడంతో కిరణ్ ఈ సినిమాను ఓకే చేసేశాడు.
సుకుమార్ అన్న కొడుకు అశోక్ బండ్రెడ్డితో కలిసి వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. వంశీ ఇటీవలే ‘లిటిల్ హార్ట్స్’ను తన బేనర్లో రిలీజ్ చేసి ఘనవిజయాన్నందుకున్నాడు. కిరణ్ నుంచి త్వరలో ‘కే రాంప్’ రిలీజ్ కాబోతోంది. బేబీ మేకర్స్‌తో ‘చెన్నై లవ్ స్టోరీ’ చేస్తున్నాడు. అది పూర్తయ్యాక వచ్చే ఏడాది ఆరంభంలో వీరా కోగటం చిత్రంలో నటించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు హేమంత్ అనే కొత్త కుర్రాడు చెప్పిన ఓ వైవిధ్యమైన కథకు సుకుమార్ ఓకే చెప్పారు. అది కొత్త నటీనటులతో తెరకెక్కే సినిమా. సుకుమార్ నుంచి ఇంకో ఇద్దరు శిష్యులు కూడా త్వరలో దర్శకులుగా మారే అవకాశముంది. ‘పుష్ప-2’ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న సుకుమార్.. రామ్ చరణ్‌తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ మీద ప్రస్తుతం తన శిష్యులతోనే కలిసి కథను వండే ప్రయత్నంలో ఉన్నాడు సుక్కు.