వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై ఆనాటి జగన్ సర్కార్ ఏ రకంగా కక్ష సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాట్సాప్ లో చిన్న పోస్ట్ షేర్ చేసినా సరే సీఐడీ కేసులు నమోదు చేసి నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది. ఇక, టీడీపీ, జనసేన నేతలు కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టు పెడితే చాలు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి టార్చర్ పెట్టారు.
ఈ నేపథ్యంలోనే వైసీపీ అరాచక పాలన వల్ల తన మిత్రుడిని కోల్పోయానని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈరోజు శాసనసభలో వెల్లడించారు. వైసిపి వేధింపులు పై అసెంబ్లీలో ఈరోజు జరిగిన చర్చలో గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ సమయంలో అమెరికా నుంచి ఫార్వర్డ్ అయినా ఒక వాట్సాప్ మెసేజ్ ను టిడిపి సానుభూతి పురుడైన తన మిత్రుడు వాట్సప్ లో షేర్ చేశాడని గుర్తు చేసుకున్నారు.
అయితే ఆ పోస్టు అప్పటి ఉత్తరాంధ్ర వైసిపి ఇన్చార్జ్ ను కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ త మిత్రుడిపై సిఐడి కేసు నమోదు చేశారని అన్నారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని విశాఖ నుంచి కర్నూలుకు తరలించారని అన్నారు. కోవిడ్ ప్రబలుతున్న ఆ సమయంలో విజయనగరంలో అతడిని విచారించే అవకాశం ఉన్నా సరే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కారులో కోవిడ్ నిబంధనలు అతిక్రమించి మరీ కర్నూలుకు తరలించారని అన్నారు.
ఆ తర్వాత ఆయన కోవిడ్ బారిన పడి తీవ్ర అనారోగ్యం పాలై చనిపోయారని గుర్తు చేసుకున్నారు. ఇలా ఒక వాట్సాప్ సందేశం ఫార్వర్డ్ చేసిన పాపానికి తన మిత్రుడు ప్రాణం కోల్పోయాడని గంటా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఎన్నో అరాచకాలు వైసిపి ప్రభుత్వంలో జరిగాయని గంటా అన్నారు.