వైసీపీ హయాంలో ఆఖరికి యూనివర్సిటీలలో కూడా అవకతవకలకు అప్పటి ప్రభుత్వం పాల్పడిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వైస్ ఛాన్సలర్ నియామకాల్లో ఒక సామాజిక వర్గానికి చెందిన వారికే పెద్దపీట వేయడం మొదలు యూనివర్సిటీలను పార్టీ ఆఫీసులుగా మార్చడం వరకు వైసిపి నేతలు చేసిన అరాచకాలు ఎన్నో ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో 2019-24 మధ్య జరిగిన అక్రమాలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు.
కంప్యూటర్లు కొనుగోలులో అవకతవకలు, యూనివర్సిటీ వాహనాలను వ్యక్తిగత అవసరాలకు వాడడం, నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లు, నియామకాలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడం వంటి వ్యవహారాలపై విచారణ చేసేందుకు కమిటీని వేస్తామని లోకేష్ చెప్పారు.
అంతేకాకుండా వంద రోజుల్లోపు ఆ కమిటీ నివేదిక తెప్పించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. విశ్వవిద్యాలయాలను పారదర్శకంగా నడిపించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని లోకేష్ చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఒక విద్యార్థి ఫిట్స్ రావడంతో చనిపోయారని, దానిపై కొన్ని విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడం సరికాదని లోకేష్ చెప్పారు. ప్రభుత్వపరంగా తప్పు లేకపోయినప్పటికీ ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు.
రాజకీయాలకు అతీతంగా యూనివర్శిటీలకు వైస్ ఛాన్సలర్ లను నియమిస్తున్నామని చెప్పారు. దేశంలోని టాప్ 100 యూనివర్సిటీలలో ఆంధ్రా యూనివర్సిటీని ఒకటిగా తీర్చిదిద్దే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఇచ్చారని గుర్తు చేశారు. కొందరు స్వార్థం కోసమే విశ్వవిద్యాలయాల్లో గొడవలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో సొంత భవనాలు లేని పాలిటెక్నిక్ కళాశాలలకు నూతన భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టామని లోకేష్ వెల్లడించారు.