వైసీపీ హయాంలో జగన్ విధ్వంసకర ఆలోచనతో పాలన మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రజా వేదిక విధ్వంసంతో నియంత పాలనకు నాంది పలికిన జగన్ రాష్ట్రం నుంచి అమరరాజ వంటి కంపెనీలను తరిమేసే వరకు ఆ పాలన కొనసాగించారు. ఒక మాటలో చెప్పాలంటే జగన్ హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఐటి కంపెనీలు, దిగ్గజ పారిశ్రామిక సంస్థలు ముందుకు రాలేదు.
అయితే 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ చూసి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ఐటీ కంపెనీలు, పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసిపి పాలనలో పరిశ్రమల యజమానులను బెదిరించారని, రాష్ట్రంపై పెట్టుబడిదారులకు నమ్మకం పోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఇమేజ్జ ను గన్ దెబ్బతీశారని చాలా పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లాయని గుర్తు చేశారు.
అయితే, బెదిరిస్తే పరిశ్రమలు ఏపీకి రావని, పెట్టుబడిదారులకు నమ్మకం కలిగిస్తేనే వస్తారని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొరుగు రాష్ట్రాలకు వెళ్తామన్న అనేక కంపెనీలను ఏపీకి తీసుకువచ్చామని చెప్పారు. ఆ నమ్మకం తిరిగి సంపాదించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామని, అన్ని రకాలుగా అండగా ఉంటామని పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించామని అన్నారు.
కియా కార్ల పరిశ్రమ కోసం 8 నెలల్లో రిజర్వాయర్ పూర్తి చేసి నీరు అందించామని గుర్తు చేశారు. ఆ క్రమంలోనే ఏపీకి వచ్చేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. త్వరలోనే విశాఖ ఐటీ హబ్ గా మారిపోతుందని చెప్పారు. విశాఖకు గూగుల్, టీసిఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీలు రాబోతున్నాయని చెప్పారు. దసరా ఉత్సవాల్లో కలకత్తా మైసూరు సరసన విజయవాడ చేర్చామని, ఘనంగా విజయవాడ ఉత్సవ్ , దసరా నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. రోడ్ల నాణ్యతలో రాజీ పడబోమని, గుంతలు లేకుండా చేస్తామన్న మాట నిలబెట్టుకున్నామని వ్యాఖ్యానించారు.