టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇరు తెలుగు రాష్ట్రాలలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాక్ ఎలా ఉన్నా సరే పవన్ సినిమాకు వచ్చే హైప్ వేరే లెవెల్. హరిహర వీరమల్లు ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో పవన్ అభిమానులు ఓజీ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలను మించి ఓజీ సినిమా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చింది.
దీంతో థియేటర్లలో పవన్ కళ్యాణ్ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ అభిమానులకు హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యం చేసిన సూచన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓజీ చిత్రం చూసిన పవన్ అభిమానులు తీవ్ర ఉద్వేగానికి లోనై టీ షర్ట్ లు చించేసుకుంటున్నారని, పవన్ పై వారికి ఉన్న అభిమానాన్ని తాము అర్థం చేసుకోగలమని ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యం తెలిపింది.
అదే సమయంలో మిగతా ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా పవన్ అభిమానులు తమ వెంట ఒక టీ షర్ట్ ను తెచ్చుకోవాలని సూచించింది. ప్రేక్షకులకు ఎప్పటికీ మర్చిపోలేని సినీ అనుభూతిని పంచేందుకు ప్రసాద్ మల్టీప్లెక్స్ సిద్ధంగా ఉంటుందని, కానీ ప్రేక్షకుల దుస్తుల విషయంలో బాధ్యత వహించలేమని సెటైర్ వేసింది. పవన్ అభిమానులను నొప్పించకుండా థియేటర్లో మిగతా ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యం విడుదల చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి, ఆ సూచనలను పవన్ ఫ్యాన్స్ ఎంతవరకు పాటిస్తారు అన్నది తేలాల్సి ఉంది.