మెట్రో సంస్థకు నష్టాలు వస్తున్నాయని, ఇకపై తాము మెట్రో నిర్వహణను చేయలేమని ఎల్&టీ సంస్థ... కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. చార్జీలు పెంచినా సరే తీవ్ర నష్టం వాటిల్లడంతో తాము ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నామని ఎల్&టీ యాజమాన్యం రేవంత్ సర్కార్ కు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇకపై మెట్రో రై నిర్వహణను ప్రభుత్వం చూసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు.
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఎల్&టీ సంస్థకు ఇచ్చిన 280 ఎకరాల భూమి మీద రేవంత్ రెడ్డి కన్ను పడిందని, ఆ సంస్థను వెళ్లగొట్టి, ఆ 280 ఎకరాలను పంచుకోవాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని ఆరోపణలు చేశారు.
అలాగే కొన్ని మాల్స్ ను రేవంత్ రెడ్డి తన స్నేహితులకు, దగ్గరి సంస్థలకు రాసివ్వాలని కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. మెట్రో ఆక్ట్ ఉండగా కేంద్రానికి చెప్పకుండా మెట్రోని రేవంత్ రెడ్డి ఇష్టానికి నాశనం చేస్తుంటే.. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.ఏ ముడుపులు, ఏ కమీషన్ల కోసం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడో.. కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
2014లో రాష్ట్ర విభజనతో రైడర్‌షిప్ తగ్గుతుందని ఎల్&టీ సంస్థ ఆందోళన చెందితే, స్వయంగా కేసీఆర్ వారికి ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. కరోనా కష్టకాలంలోనూ సంస్థ నష్టాల్లో ఉందని భయపడితే, కేసీఆర్ మరోసారి అండగా నిలిచారని, ₹3,000 కోట్ల వడ్డీలేని రుణం (సాఫ్ట్ లోన్) మంజూరు చేసి, అందులో ₹900 కోట్లు విడుదల చేసి మెట్రోను కాపాడారని తెలిపారు.