తమిళనాడులో ఘోర విషాద ఘటన జరిగింది. తమిళగ వెట్టి కళగం (TVK) అధ్యక్షుడు, సినీ హీరో విజయ్ ప్రచార సభలో గోడ కూలి 36 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కరూర్ లో విజయ్ నిర్వహించిన బహిరంగ సభలో జరిగిన ఈ దుర్ఘటనలో ఘటనలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులలో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది.
ఈ సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. విజయ్ ఆలస్యంగా రావడంతో చాలా సేపటి నుంచి వారు వేచి ఉన్నారు. దీంతో, ఆయన ప్రసంగిస్తున్న సమయంలో వారిని నియంత్రించడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి చాలా మంది స్పృహ కోల్పోయారు. అది గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు. క్షతగాత్రులకు సాయం చేయాలని పోలీసులను కోరారు. భారీ సమూహం మధ్య చావుబతుకుల మధ్య ఉన్న క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు అతికష్టం మీద అక్కడికి అంబులెన్సులు వచ్చాయి. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యం అందించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోదీ ప్రార్థించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య శాఖా మంత్రిని ఆదేశించానని స్టాలిన్ చెప్పారు. ఈ ఘటన తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.