అమెరికాలో ఉన్న ఇండియానా ప్రాంతంలోని మేరిల్విల్‌లో ఎన్నారైలు బతుకమ్మ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నాలుగేళ్లుగా ఇక్కడి తెలుగు ప్రజలు ఈ ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం IACC దేవాలయంలో జరిగిన ఈ వేడుక ఉల్లాసంగా సాగింది. భారతీయ సంస్కృతీసంప్రదాయలను ఈ తరం వారికి తెలిసేలా ఈ వేడుకలు జరిగాయి. 50 కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.
పిల్లలు, పెద్దలు, మహిళలు..అన్ని వయసుల వారు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. రకరకాల రంగుల పువ్వులతో చేసిన అలంకరణలతో రూపొందించిన బతుకమ్మ చుట్టూ నృత్యం చేశారు. తెలంగాణ బతుకమ్మ జానపద గీతాలతో ఆ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.
రుచికరమైన అచ్చ తెలుగు వంటకాలతో ఏర్పాటు చేసిన విందు భోజనంతో ఈ సంబరాలు ముగిశాయి. సంప్రదాయ తెలుగు వంటకాలను ఆహూతులంతా ఆస్వాదించారు. బతుకమ్మ సంబరాలు కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, తెలుగు సమాజం సంప్రదాయాలను గుర్తు చేసుకొని అందరూ కలిసేందుకు ఒక గొప్ప అవకాశం అని అందరూ అభిప్రాయపడ్డారు.
ప్రకృతిపై ప్రేమ, సంగీతం, నృత్యం, ఆహారం ఇలా అన్నింటిని కలగలిపిన పండుగ ఈ బతుకమ్మ సంబరం.
ఈ బతుకమ్మ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన లావణ్య వెలిగండ్లకు ఆహూతులంతా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్రజలంతా ఆత్మీయంగా ఒక చోట చేరి మరింత దగ్గరయ్యేందుకు, బంధాలు ధృఢపరుచుకునేందుకు ఈ బతుకమ్మ వేడుకలు దోహదపడ్డాయని అభిప్రాయపడ్డారు.